మహానగరంలో స్వైన్ ఫ్లూ కలవరపెడుతోంది. కేవలం అక్టోబర్ నెలలోనే 125 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నగరంలో స్వైన్ ఫ్లూ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మహానగరంలో స్వైన్ ఫ్లూ కలవరపెడుతోంది. కేవలం అక్టోబర్ నెలలోనే 125 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నగరంలో స్వైన్ ఫ్లూ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో 34 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ విజృంభించడానికి మారుతున్న వాతావరణ పరిస్థితులే కారణమని వైద్యులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోందని వైద్యులు చెప్తున్నారు.
అందుకే జ్వరం, దగ్గు, ముక్కు కారటం వంటి రుగ్మతలుంటే వెంటనే ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని నిర్లక్ష్యం కూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే నిజానికి ఈ లక్షణాలుంటే స్వైన్ ఫ్లూ అని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. వ్యాధినిరోధక శక్తి తక్కువగా వుండే మధుమేహంతో బాధపడేవారు, గర్భిణీలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారు ఫ్లూ బారిన పడే అవకాశాలు ఎక్కువగా వున్నాయని వైద్యులు చెప్తున్నారు.
ఇక స్వైన్ ఫ్లూ బారి నుంచి తప్పించుకోవాలంటే.. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. 3 రోజులు కంటే ఎక్కువ రోజులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడితే వైద్యులను సంప్రదించాలి.
ముక్కుకు మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. జన సమూహ ప్రాంతాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కౌగిలించుకోవడం చేయకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదని వైద్యులు చెప్తున్నారు. ఇలా చేస్తే స్వైన్ ఫ్లూ అతి త్వరలో సోకే అవకాశం వుందని వైద్యులు చెప్తున్నారు.