బతుకమ్మ పండుగ పేరుతో చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిన తెరాస నేతలు ఏకంగా రూ.150 కోట్లు బొక్కేశారని కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చ
బతుకమ్మ పండుగ పేరుతో చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిన తెరాస నేతలు ఏకంగా రూ.150 కోట్లు బొక్కేశారని కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగ కోసం తెరాస సర్కారు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ చీరలు నాసికరకంగా ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనకు దిగుతున్నారు.
దీనిపై మాజీ మంత్రి డీకే అరుణ స్పందిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను మాట్లాడే భాషను ఇంకా మార్చుకోలేదని, మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా అలాగే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బతుకమ్మ చీరల పేరిట తమకు నాసిరకం చీరలు ఇవ్వడంతో పలు ప్రాంతాల్లో మహిళలు ఆందోళనలు చేయగా, ఈ ఆందోళనల వెనుక ప్రతిపక్ష నేతలు ఉన్నారంటూ తెరాస నేతలు చేసిన ఆరోపణలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేటీఆర్ సంస్కారహీనంగా మాట్లాడారని డీకే అరుణ విమర్శించారు. ఓ వైపు మహిళలు ఆందోళనలు చేస్తోంటే మరోవైపు అన్నదమ్ములు లేని తమకు చీరలు పంపించినందుకు కేటీఆర్‌కి మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నట్లు టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆమె అన్నారు. చీరల కోసం ఖర్చు చేసిన డబ్బు ప్రజల సొమ్మని, తెరాస నేతల డబ్బుకాదని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. నాసిరకం చీరలను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అలాగే, మరో నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మహిళలు చీరలు తగులబెట్టారన్న మంత్రి కేటీఆర్ వాదనలో నిజం లేదన్నారు. మహిళలు ఆందోళన తెలపడానికి ప్రతిపక్ష పార్టీల నేతల కుట్రలే కారణమంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సిరిసిల్లలోనూ మహిళలు నిరసన వ్యక్తం చేశారని, ఆ ప్రాంతంలో తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీ ఆడబిడ్డలు ఇటువంటి చీరలు కట్టుకుంటారా?’ అని సీఎం కేసీఆర్‌ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పేదలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చులకన భావం ఏర్పడిందన్నారు. నిజంగా నిరుపేద కుటుంబాలపై కేసీఆర్‌కి ప్రేమ ఉంటే వారి నిత్యావసరాలైన చక్కెర, కందిపప్పు, గోధుమ వంటి సరుకులన్నింటినీ కలిపి 100 రూపాయలకి అందించాలని అన్నారు. ఇటువంటి చీరలు ఇచ్చి పేదలను అవమానించకూడదని జీవన్ రెడ్డి హితవు పలికారు.