వందేభారత్ ఎక్స్‌ప్రెస్ దేశీయంగా తయారైన మొదటి సెమీ హైస్పీడ్ రైలు. ఈ నెల 15వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభమైన మూన్నాళ్లకే గుర్తుతెలియని వ్యక్తులు అద్దాలను పగులగొట్టారు. రాళ్లు విసరడం వల్ల రైలు కిటీకి అద్దం ఒకటి పగిలిపోయిందని ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు.
అంతకుముందు ఈ రైలు ట్రయర్ రన్ చేసే సమయంలో కూడా ఇలానే సంఘటన చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ 20న ఢిల్లీ-ఆగ్రా మధ్య ట్రయల్ రన్ నిర్వహించే సమయంలోనూ ఇలానే రాళ్ల దాడి జరిగింది. కాగా రాళ్లు విసిరే వాళ్లలో చాలా మంది చిన్న పిల్లలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ పిల్లలందరికీ అవగాహన కల్పించారు. వందే భారత్ రైలుపై రాళ్లు విసరడం రెండునెలల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం.
ఫిబ్రవరి 15న ప్రారంభమైన ఈ రైలు రాళ్ల దాడులకు గురవుతోంది. అయితే ఈ రైలులో ప్రయాణ టిక్కెట్‌లు రెండు వారాల దాకా బుక్ అయినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.