Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికల మార్పునకు విశ్వవిద్యాలయాలు సిద్ధమవ్వాలి: ఉపరాష్ట్రపతి

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (22:03 IST)
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికల్లో మార్పులు చేస్తూ భవిష్యత్ భారతానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, విశ్వవిద్యాలయాలకు సూచించారు.

దేశ అవసరాలకు అనుగుణంగా సరికొత్త కోర్సులను కూడా డిజైన్ చేసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం బెంగళూరులోని  పీఈఎస్ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. 4వ పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా విశ్వవిద్యాలయాలు మన యువతకు 5జీ సాంకేతికత, కృత్రిమ మేధ, రొబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక విషయాలను నేర్పించాలని సూచించారు.

విద్యారంగంలో భారతదేశ భవ్యమైన చరిత్రను గుర్తుచేస్తూ, రానున్న రోజుల్లో భారతదేశానికి పునర్వైభవం తీసుకురావడంలో సాంకేతిక విశ్వవిద్యాలయాలు కీలకమైన పాత్రను పోషించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. భారతదేశాన్ని విజ్ఞానకేంద్రంగా మార్చడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం, అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు భాగస్వాముల కోసం అనుమతివ్వడం ఆహ్వానించదగిన పరిణామమన్న ఆయన, డీఆర్డీవో, ఇస్రో సహకారంతో పీఈఎస్ విశ్వవిద్యాలయం రెండు ఉపగ్రహాలను రూపొందిస్తుండటాన్ని ప్రత్యేకంగా అభినందించారు. 

‘మన ప్రయివేటు సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ అవసరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మనిర్భర భారత నిర్మాణంలో, అంతరిక్ష రంగంలో అధునాతన సాంకేతిక దేశంగా రూపుదిద్దడంలో ప్రత్యేకమైన చొరవతీసుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.
 
డ్రోన్ సాంకేతికత ద్వారా వివిధ రంగాలకు ఎంతో మేలు చేకూరుతుందన్న ఉపరాష్ట్రపతి, సృజనాత్మకత, ఐటీ, ఫ్రుగల్ ఇంజనీరింగ్ వంటి వాటిలో అద్భుతాలు సృష్టించే సత్తా భారతదేశానికి ఉందన్నారు. భారతదేశాన్ని డ్రోన్ హబ్ గా మార్చేందుకు ఎన్నో అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.

పీఈఎస్ విశ్వవిద్యాలయం డ్రోన్ టెక్నాలజీని మరింత అభివృద్ధి పరిచే దిశగా కోర్సులను ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు.

భారతదేశ ఇంజనీరింగ్ కోర్సుల్లో విదేశీ రచయితలకు సంబంధించిన ఎన్నో సాంకేతిక పుస్తకాలున్నాయని, ఈ అంశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రచయితల ద్వారా భారతీయ భాషల్లో పుస్తకాలు తీసుకొచ్చే దిశగా కూడా ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.

భారతీయ భాషల్లో సాంకేతిక పుస్తకాలు రావడం ద్వారా యువకులు ఆ పద్ధతులను అవగతం చేసుకుని ఆచరణలో చూపించేందుకు వీలవుతుందన్నారు. తద్వారా రైతులు, గ్రామీణ భారతం, వెనుకబడిన వర్గాల సమస్యలను పరిష్కారాలను కనుగునేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. 

సాంకేతికతకు సంబంధించిన పరిశోధనల్లో సామాజిక పరిస్థితుల గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఎదురౌతున్న వాతావరణ మార్పులతో పాటు సుస్థిరాభివృద్ధి వంటి వాటిపైనా పరిశోధనలు జరగాలని సూచించారు. భారతీయ నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి ప్రజాజీవితాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయత్నించాలని సాంకేతిక విద్యాసంస్థలకు సూచించారు.

స్నాతకోత్సవంలో పట్టాలను అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి, విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ జీవితంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ‘లోకా సమస్తా సుఖినో భవన్తు’ మంత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ లక్ష్యంతోనే పనిచేయాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలన్నారు.

యోగ, ధ్యానంను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలన్నారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బి.ఏ. బసవరాజ్, పి.ఈ.ఎస్. విశ్వవిద్యాలయ కులపతి, కర్ణాటక విద్యాశాఖ పూర్వ సలహాదారు డా. ఎం.ఆర్. దొరెస్వామి, ఉపకులపతి డా. జె.సూర్య ప్రసాద్, భావి కులపతి ప్రొ. డి.జవహర్,   రిజిస్ట్రాల్ డా. శ్రీధర్ సహా అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments