Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా విద్యారంగం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

Advertiesment
మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా విద్యారంగం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
, బుధవారం, 25 ఆగస్టు 2021 (23:12 IST)
మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలతో విద్యా రంగం ముందుకు సాగవలసి ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భవిష్యత్తు సవాళ్లను అధికమించే క్రమంలో విద్యావేత్తలు, సమాజం నడుమ అవగాహన అవసరమన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం బుధవారం నిర్వహించారు.

విశ్వవిద్యాలయ కులపతి హోదాలో విజయవాడ రాజ్ భవన్ నుండి గౌరవ గవర్నర్ వెబినార్ విధానంలో ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా విద్య, సాధికారకత ధ్యేయంగా ప్రత్యేకంగా వారి కోసమే ఏర్పాటైన ఈ సంస్ధ తగిన పరిజ్ఞానం, నైపుణ్యాలతో సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. లింగ సమానత్వాన్ని కాపాడే క్రమంలో విశ్వవిద్యాలయం నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు.
 
కరోనా విశ్వ వ్యాప్తంగా విభిన్న రంగాలపై ఊహించని ప్రభావం చూపిందని, ఈ క్రమంలో విద్యారంగం కూడా ఒడిదుడుకులకు లోనైందన్నారు. సాంప్రదాయ బద్దమైన అభ్యాస విధానాలను విడనాడి, ఆధునిక ఆన్ లైన్ బోధనను  అనుసరించవలసి వచ్చిందన్నారు.  ఈ క్రమంలో విద్యార్ధుల హాజరు అతి తక్కువగా నమోదు కావటం సవాలుగా పరిణమించిందని గౌరవ గవర్నర్ పేర్కొన్నారు.
 
విద్యార్థులు, విద్యావేత్తలు వేగవంతమైన ఈ మార్పును ఆకళింపు చేసుకుని ప్రపంచ పోటీకి అనుగుణంగా తగిన పురోగతిని సాధించటానికి అవసరమైన ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించుకోవలసి ఉందన్నారు. క్లిష్ట పరిస్దితులను అవకాశాలుగా మలచుకునే సామర్ధ్యం భారతీయులుగా మనందరిలోనూ ఉందని ఆక్రమంలో ముందడుగు పడాలని సూచించారు. ఏ సమాజంలోనైనా సామాజిక మార్పు, పురోగతి, అభివృద్ధికి విద్య దోహదం చేస్తుందన్నారు.
 
నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు జ్ఞానం, నైపుణ్యం, పారిశ్రామిక అనుసంధానత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయని వివరించారు. పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం అనుసరిస్తున్న ఆన్‌లైన్ బోధన, అభ్యాసం, పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో అందిస్తున్న ప్రోత్సాహం వంటి అంశాలు విద్యార్ధుల జీవిత లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయన్న విశ్వాసం తనకుందన్నారు. ప్రపంచ విద్యా సమీక్ష 2021లో దేశంలోని 121 భారతీయ విశ్వవిద్యాలయాలలో 58వ స్ధానాన్ని, రాష్ట్ర స్దాయిలో 3వ స్థానాన్ని పొందటం ద్వారా విశ్వ విద్యాలయం ప్రత్యేక గుర్తింపు పొందటం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిలో మహిళా విద్యకు చిరునామాగా ఆవిర్భవించడమే విశ్వవిద్యాలయ ఎజెండాగా ఉండాలన్నారు.
 
ఆరువేలకు పైబడిన విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్‌లో పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాలలో ఇది ఒకటిగా ఉండటం శుభపరిణామమన్న గవర్నర్ సృజనాత్మకత, సరికొత్త ఆలోచనల ఆవిర్భావానికి ప్రేరణగా నిలిచిందన్నారు. మహిళల భద్రతే ధ్యేయంగా 13 జిల్లాలలో ఈ సంవత్సరం మహిళా భద్రత కేంద్రాలను స్దాపించటం అచరణీయమన్నారు.

విశ్వవిద్యాలయంలో పొందిన జ్ఞానం, నైపుణ్యం, విలువలు జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవటానికి ఖచ్చితంగా ఉపకరిస్తాయన్న విశ్వాసం తనకుందని మాననీయ ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రముఖ రచయిత్రి లలిత కుమారి (ఓల్గా)కు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.  విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, విశ్వవిద్యాలయ ప్రతినిధులు పాల్గొనగా, తిరుపతి ప్రాగణం నుండి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉపకులపతి అచార్య డి జమున తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాలలో చీనీ-నిమ్మ సాగుకు సాంకేతిక సలహా సంప్రదింపులలో సంహిత ఓ నూతన అధ్యాయం