మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ పేరు దాదాపుగా ఖరారైంది. అలాగే ఉప ముఖ్యమంత్రి రేసులో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే పేరు బలంగా వినిపిస్తుంది. దీంతో మహారాష్ట్రలో ఒకటి రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది.
మరోవైపు, సోమవారం జరిగే మహాయుతి సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ సమావేశానికి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ హాజరవు తారు. మంత్రిత్వ శాఖలు కేటాయింపులపై ముగ్గురు నేతలు చర్చిస్తారు.
హోం, పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ, ఆర్థిక శాఖలతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవిపై మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత అదిరింది. హోం, స్పీకర్ పదవి విషయంలో బీజేపీ పట్టు వదలడం లేదు. ఈ కారణం వల్లే కొత్త సీఎం ప్రకటన ఆలస్యం అవుతోందని సమాచారం. డిసెంబరు రెండులోగా దీనిపై తేల్చుకోవాలని, లేదంటే తామే నిర్ణయిస్తామని అమిత్ షా మహాయుతి కూటమి నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
దీంతో శాసనసభాపక్షను ఎన్నుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సోమ లేదా మంగళవారాల్లో సమావేశం కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ శాసనసభా పక్షనేతగా ఎన్నుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడే మహాయుతి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారని తెలుస్తోంది. మీడియాలో దీనిపై చర్చ జరుగుతోందన్న ఏక్నాథ్ షిండే ఈ ప్రతిపాదనను మాత్రం తోసిపుచ్చలేదు. దీంతో శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎం అవుతారనే చర్చ ఊపందుకుంది.