తమ బిడ్డలు ఏదేనీ తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తుంటారు. అవసరమైతే ఒక దెబ్బకొడతారు కూడా. అలా, తన బిడ్డ చెడు మార్గంలో ప్రయాణించడాన్ని జీర్ణించుకోలేని ఓ తండ్రి తన బిడ్డను చెంపపై కొట్టాడు. అంతే.. నాన్నపై కక్ష పెంచుకున్నాడు ఆ కుమారుడు. కిరాయి ముఠాతో తండ్రిపై కాల్పులు జరిపించి హత్య చేశాడు. ఈ దారుణం దేశరాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.
ఇటీవల ఢిల్లీకి చెందిన కెమికల్ వ్యాపారి అనిల్ ఖోడా హత్యకు గురయ్యాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఏదో విషయమై వివాదం నెలకొన్న నేపథ్యంలో అనిల్ తన కొడుకు గౌరవ్‌ను చెంపపై కొట్టాడు. దీంతో కొడుకు తండ్రిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఇందుకోసం సుపారీ కిల్లర్‌తో రూ.5 లక్షలు చెల్లించేలా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలో ఒకరోజు అనిల్ కార్యాలయలో మీటింగ్ ముగించుకుని తిరిగివస్తుండగా, బైక్‌పై వచ్చిన ఆగంతకులు అతనిపై కాల్పులు జరిపారు. అనిల్ మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.
గౌరవ్ చెడు తిరుగుళ్లకు అలవాటుపడి తండ్రిని తరచూ వేధించేవాడని, ఈ పరిస్థితుల్లోనే తండ్రి అతనికి డబ్బులు ఇవ్వడం మానేశాడని తేలింది. ఇటువంటి సందర్భంలోనే అతను కొడుకును కొట్టాడని, దీనికి ప్రతీకారంగా గౌరవ్ తన తండ్రిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు.