Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవ 'సాయం'లో రాజకీయ 'రణం'

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (12:07 IST)
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాలు రైతుల చుట్టూనే తిరుగుతున్నాయి. అలాంటి ముఖ్యమైన రైతు వర్గానికి ప్రయోజనాలు కలగాల్సిందే. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతన్నకు భరోసా కల్పించాల్సిందే. రైతులు పండించిన పంటకు సరైన మార్కెట్ ధర రావాల్సిందే. ఈ విషయంలో ఎవరికీ సంకోచం అవసరం లేదు. అన్ని పార్టీలదీ ఇదే మాట. మరి వ్యవసాయ సంస్కరణల బిల్లు చుట్టూ రాజకీయం ఎందుకు అలుముకుంది. సామాన్య రైతులకు సైతం మార్కెట్ ధర లభించే విధంగా తనకు ఇష్టం వచ్చిన రీతిలో తాను పండించిన ఉత్పత్తులను అమ్ముకునే వీలు రైతులకు కలుగుతుంటే మరి ఎవరికి వచ్చిన అడ్డంకి ఏంటి...? 
 
అయితే ఇదేసమయంలో రైతుల హక్కులకు భంగం కలుగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది. అన్ని పార్టీలు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరముంది. ఏదైనా కొత్తగా ప్రభుత్వం బిల్లు తెచ్చిన సమయంలో అందులో లోటుపాట్లు ఉండటం సహజం. బిల్లులో ఉన్న లొసుగులను అవకాశంగా మలుచుకునేందుకు దళారులు ప్రయత్నించటం కొత్తేమీ కాదు. అంత మాత్రాన అసలు వ్యవసాయ సంస్కరణలు అక్కర్లేదు అన్న వాదన కూడా సరికాదు. 
 
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణలపై విస్తృతంగా చర్చ జరగాలి. రెండు సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకువచ్చిన బిల్లుల సారాంశంతోనే ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆ ఆర్డినెన్స్‌లకు బిల్లుల రూపంలో చట్ట రూపంలోకి తెచ్చింది. పార్లమెంటు ఉభయసభలు ఈ బిల్లులకు ఆమోదం తెలిపాయి. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సిన అవసరం ఉంది. అదికూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోయే పనే. అయితే రెండు సంవత్సరాల క్రితం ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు ఎలాంటి అలజడి లేకుండా సైలెంట్‌గా ఉన్న విపక్షాలు ప్రస్తుతం బిల్లుల ఆమోదం సమయంలో ఎందుకు రాద్దాంతం చేస్తున్నట్లో తెలియని పరిస్థితి.
 
కేంద్రంలో అధికార బీజేపీకి పూర్తిస్థాయి బలం ఉంది కనుక తాము బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకోలేమని తెలుసు గనుక కేంద్రం ఏది చేసినా చూస్తూ ఉండాల్సిన పరిస్థితే అని భావిస్తే, ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుల విషయంలో ముందుగానే ప్రజలలో సమగ్రమైన చర్చ జరిగేలా చూడాల్సిన బాధ్యత విపక్షాలకు ఉంది. వ్యవసాయ బిల్లులో లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపాల్సిందే. రైతన్నలకు అన్యాయం జరక్కుండా అడ్డుకోవాల్సిందే.. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించడం లేదన్నది కొందరి నుంచి వినిపిస్తున్న వాదన. అధికార పక్షం బిల్లు తెచ్చింది కాబట్టి, విపక్షం వ్యతిరేకించాల్సిన అనే భావన మాత్రం ఉండకూడదు.
 
తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణలపై రైతుల్లో అవగాహన లేదు. ఇంత పెద్ద లబ్ధి చేకూరుస్తున్నామంటూ చెప్పుకునే అధికార బీజేపీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఈ బిల్లుపై ఎలా స్పందిస్తారు. వారికి ఎలాంటి అవకాశాలు కావాలి అనే దానిపై ముందుగా ఎలాంటి సూచనలు తీసుకోలేదనిపిస్తోంది. బిల్లుపై పార్లమెంటులో పెద్దల సభలో రచ్చ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా దీనిపై చర్చ సాగాల్సిన అవసరం ఎందుకొచ్చింది. బిల్లుల సారాంశాన్ని ఢిల్లీ పెద్దలు ముందుగానే ప్రజల ముందుకు తీసుకు వెళ్ళడంలో విఫలమయ్యారా... రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోలేదా... అసలు రాష్ట్ర ప్రభుత్వాలను పట్టించుకోలేదా.... ఇవన్నీ ఇప్పుడు సగటు పౌరుడి ముందుకు వస్తున్న ప్రశ్నలు.
 
అసలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులు ఏంటి.... దాని ద్వారా రైతులకు చేకూరే లాభం ఏమిటి అనేది ఒకసారి పరిశీలిస్తే...
 
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను సెప్టెంబర్ 14న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం ప్రోత్సాహం, సదుపాయకల్పన బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020ను మూజువాణి ఓటుతో ఈ నెల 17న లోక్‌సభ ఆమోదించింది. ఇక తృణధాన్యాలు, పప్పులు, ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే.. నిత్యవసర ఉత్పత్తుల సవరణబిల్లు-2020ను ఈనెల 15న ఆమోదించింది. నిత్యవసర వస్తువుల బిల్లు విషయంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఈ విషయంలో నిత్యావసరాలపై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్రానికి దక్కుతుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. 
 
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు సంబంధించిన బిల్లుపైన ఇప్పుడు రగడ జరుగుతోంది. మార్కెట్ కమిటీలకు సంబంధం లేకుండా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతే దేశంలో ఎక్కడైనా తన ఉత్పత్తులను అమ్ముకునే వీలు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. బిల్లులోనూ అదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే అందులోనే తిరకాసు ఉందని కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేదిగా ఉందని విపక్షాలు వాదిస్తున్నాయి. జియో మార్టు కోసమో రిలయన్స్ వంటి కొన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే దిశగా ఈ బిల్లు దొంగచాటుగా తెచ్చారన్నది బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రధాన రాజకీయ పక్షాల బలమైన వాదన. 
 
మరి ఈ బిల్లు కార్పొరేట్ సంస్థలకు ఎలా లబ్ధి చేకూరుస్తుందని మాత్రం ఎవరూ క్లారిటీగా చెప్పడం లేదు. బిల్లు సారాంశం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా తన ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముకోవచ్చు. ముందుగానే ఏ సంస్థతో నైనా మార్కెటింగ్ విషయంలో ఒక ఒప్పందానికి రావచ్చు. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి కూడా ఉండదు. అయితే రైతులు కార్పొరేట్ సంస్థలతో ముందుగా అవగాహన ఒప్పందం చేసుకోవచ్చన్న విషయంలోనే తిరకాసు ఉందని అమాయక, సామాన్య రైతులు కార్పొరేట్ మాయగాళ్ళ వలలో చిక్కుకుంటారన్నది కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన. 
 
కొత్త బిల్లుతో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. సామాన్య రైతు ఎప్పుడు దళారుల చేతిలో బలిపశువుగానే మిగులుతున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులలో పరిస్థితి అందరికీ తెలియంది కాదు. మార్కెట్ యార్డులో అమ్మలేక... తాను పండించిన పంటకు సరైన ధర రాక సగటు రైతు ఎప్పుడు విలవిలలాడుతూనే ఉన్నాడు. ధర వచ్చే దాకా తన పంటను అమ్మకుండా నిల్వ చేసుకోగలిగిన నాడే ఆ రైతుకు సరైన ధర లభిస్తోంది. న్యాయం జరుగుతుంది. అయితే ఇది బడుగు రైతుకు సాధ్యమయ్యే పని కాదు. మోతుబరి రైతులే ఈ విషయంలో లబ్ధి పొందుతున్నారు. రైతుల సంక్షేమం పేరు చెప్పే ప్రభుత్వాలు కూడా పంట చేతికి వచ్చిన సమయంలోనే తగిన ధర అందించడంలో విఫలం అవుతున్నాయి. ఇదంతా షరా మామూలే.
 
కొత్త బిల్లు వల్ల రైతులు నేరుగా దేశంలో ఎక్కడైనా తమ పంటను అమ్ముకునే అవకాశం లభిస్తుండటంతో ప్రస్తుతం దొరికే కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధర లభించే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. కానీ ఏ ఒక్క బడుగు రైతు తన కొద్దిపాటి పంటను ఎక్కడికో ఎక్కువ ధర ఉన్న చోటికి తీసుకు వెళ్ళ గలిగే వీలు ఉంటుందా అన్నది మాత్రం సందేహమే. సంస్కరణలు రైతులకు లాభదాయకంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. విపక్షాలు మాత్రం రైతులకు నష్టం జరుగుతుందని మండిపడుతున్నాయి.
 
245 సీట్లున్న రాజ్యసభలో బీజేపీకి 86, కాంగ్రెస్‌కు 40 మంది సభ్యుల బలముంది. రాజ్యసభలో కాంగ్రెస్ బిల్లును వ్యతిరేకించింది. బిజెపి మిత్రపక్షాలలో అకాలీదళ్ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయి. ఇతర ప్రాంతీయ పార్టీలు వైసిపి, తెలుగుదేశం, అన్నా డీఎంకే మద్దతు బీజేపికి దక్కింది. ఇక టీఆర్ఎస్ పార్టీ సభ్యులు బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవసాయ బిల్లును తూర్పారబట్టారు. ఇది ఒక తేనెపూసిన కత్తిలాంటిదని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి వంటిదని.. రైతులు ఎంతో నష్టపోతారని విమర్శలు గుప్పించారు. ఇదిలావుంటే శివసేన సభ్యులు, ఇక ఆమాద్మీ, సమాజ్‌వాదీ, బీఎస్పీ పార్టీల సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో సభలో మూజువాణి ఓటుతో బిల్లును కేంద్రం గట్టెక్కించ గలిగింది కానీ... బిల్లుపై రచ్చ మాత్రం కొనసాగుతోంది. 
 
కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవసాయ బిల్లును అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా రైతు రక్షణ పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ హర్యానాలలోనే రైతులు పార్టీల మద్దతుతో ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమాన్ని దక్షిణాదికి కూడా వ్యాప్తి చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. ఇదే అదనుగా బిల్లును వ్యతిరేకించే మిగిలిన రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేసి లాభపడాలని చూస్తోంది. మరి వ్యవసాయ సంస్కరణల బిల్లుతో రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్నది మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా వివరించలేక పోతున్నది. బిల్లులలో సవరణలు సూచించింది. వ్యాపారులు రైతులు వద్ద నుంచి కనీసం మద్దతు ధర కంటే తక్కువకు పంట కొనుగోలు చేయడానికి వీలులేకుండా చట్టంలోనే ఒక షరతు వుండాలంటోంది.
 
మరోవైపు 
రైతు బంధులాంటి పథకాలతో అన్నదాతకు అండగా మారిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దేశ వ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఏపీ వంటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వ బాటలోనే రైతు భరోసా వంటి పథకాలను ప్రవేశపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు నేరుగా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ పరిస్థితుల్లో  రైతులకు పెట్టుబడి విషయంలో ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నట్లు అయింది. పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి పోయింది. ఈ నేపథ్యంలో స్వేచ్ఛగా మార్కెట్ చేసుకునే అవకాశం ఉన్న కొత్త వ్యవసాయ బిల్లుతో రైతన్నకు తెలంగాణలాంటి రాష్ట్రాల్లో మంచి అవకాశమే ఉంది. అది కాక తెలంగాణ వంటి ప్రభుత్వాలు రైతులకు ఏ కాలంలో ఏ పంట వేయాలి అన్న దాని మీద కూడా అవగాహన కల్పిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం టీఆర్ఎస్ కూడా కేంద్రం బిల్లుతో క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అటు కేంద్రానికి ఇటు  ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.
 
ప్రస్తుత కేంద్ర వ్యవసాయ సంస్కరణలు బిల్లును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే, ఏపీలో వైసిపి ప్రభుత్వం మాత్రం బిల్లుకు మద్దతు తెలిపింది. బిల్లు విషయంలో తెలుగు రాష్ట్రాలు చెరో దారి ఎంచుకున్నాయి.
 ఇదంతా సరే వ్యవసాయ సంస్కరణల బిల్లుతో రైతులకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుందని దళారీల బారినుంచి బయట పడతారని బిజెపి ఘంటాపదంగా వాదిస్తోంది.
 
ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఏకంగా లోపాలను వివరించాలి అంటూ విపక్షాల కు సవాల్ విసిరారు. వన్ నేషన్... వన్ పాలసీ అంటూ అన్నింటిలోనూ మార్పులు తెస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రస్తుతం ఒకే దేశం... ఒకే మార్కెట్ నినాదంతో వ్యవసాయ రైతు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఏదేమైనా అసలు ఈ చట్టం వల్ల ప్రధానంగా ఇలాంటి ఉపయోగాలుంటాయి అంటూ బిజెపి, బిల్లును సమర్థించే పక్షాలు ప్రజల ముందుకు వచ్చి రైతులకు తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
 
అదేరీతిలో విపక్షాలు కూడా బిల్లును మొండిగా వ్యతిరేకించడమేకాకుండా... ఇందులో ఉండే లోటుపాట్లను సవరించే ప్రయత్నం చేయాలి. రైతులను అప్రమత్తం చేసి కొత్త బిల్లుతో మోసపోకుండా జాగ్రత్త పడే పరిస్థితులు కల్పించాలి. ఏదో ఉద్యమం చేశాం పొలిటికల్ మైలేజీ వచ్చింది అన్నట్లు కాకుండా రైతులకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో తేటతెల్లం చేసి బిల్లులో మార్పులు తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా ఒత్తిడి తేవాలి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్నల విషయంలో ఏకపక్షంగా బిల్లును తీసుకు రాకుండా అన్ని పక్షాలతో సమగ్రంగా చర్చించి , రైతు నాయకులను కూడా  భాగస్వాములను చేసి సమగ్ర విధానానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా వుంది. 
 
రచన.. వెలది కృష్ణకుమార్,
సీనియర్ జర్నలిస్టు,
హైదరాబాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments