Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంజనేయా? ఎక్కడ పుట్టావయ్యా?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (17:43 IST)
దేవుడు సర్వాంతర్యామి. ఎక్కడ కొలిచినా ఏ భక్తుడు పిలిచినా కరుణించి వరాలు కురిపించేవాడే దేవుడు. పిరికితనాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని నింపే అంజనీపుత్రుడు జన్మస్థలంపై గందరగోళం నెలకొంది? దేవుడి జన్మించిన స్థలం ఆయన కొత్త మహిమలు తెచ్చిపెడుతుందా.. లేక తన శక్తిని రెట్టింపు చేస్తుందా..? అందరి దేవుడుగా ఉన్న హనుమంతుడిని కొందరికే పరిమితం చేయాలన్న ఆలోచన దాగి ఉందా..? టిటిడి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా స్వామీజీలు చేస్తున్న అభ్యంతరాలలో ఆంతర్యమేంటి..?ఇంతకీ హనుమంతుడి జన్మస్థలం ఇదీ అని నిరూపించే ఆధారాలు ఎవరైనా చెప్పగలరా..? ఆంజనేయుని పుట్టిన స్థలంపై మళ్ళీ మొదలైన వివాదంపై టిటిడిలో పెద్ద చర్చే జరుగుతోంది.
 
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయాన్ని ధృవీకరించిందంటే అదంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే అందులో ప్రతిదీ శాస్త్రోక్తంగా పురాణాలను అవపోశన పట్టిన వారు తీసుకుంటున్న నిర్ణయమా.. లేకుంటే అధికారులు తమ దర్పం కోసం చేస్తున్న ప్రకటనలా అనేది అర్థం కావడం లేదు. టిటిడి నిర్ణయమంటే అందులో పనిచేసే పురోహితుల నుంచి మొదలుకుని బోర్డు సభ్యుల వరకు అందరి ఆమోదంతోనే జరుగుతుంది. అయితే తాజాగా ఆంజనేయుడి జన్మస్థలం తిరుమలే అంటూ టిటిడి ఇచ్చిన నివేదికపై కొందరు స్వామీజీలు ఇప్పటికీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీనిని శాస్త్రాలు తెలిసిన జియ్యర్లు ఆమోదించకుండానే పురాణాలపై పట్టులేని కొందరు పండితులు చేసిన పరిశోధననే టిటిడి ధృవీకరించడం ఏంటని వారు మండిపడుతున్నారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అంటూ టిటిడి చూపించిన ఆధారాలు సహేతుకంగా లేవన్నది స్వామీజీల వాదన. అయితే నిజంగా హనుమంతుడు ఎక్కడ పుట్టాడు అని నిరూపించగలిగే శక్తి సామర్థ్యాలు టిటిడి తప్పుబడుతున్న ఈ స్వామీజీల దగ్గర ఉన్నాయా అంటే ప్రశ్నార్థకమే. 
 
గతంలో అనేక వివాదాలకు కేంద్రబిందువైన గోవిందనందసరస్వతి ఇప్పుడు టిటిడి చెబుతున్న విషయాలపై మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హనుమంతుడి జన్మస్థలం తిరుమలేనంటూ ప్రకటించిన వెంటనే గోవిందానందసరస్వతి అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలోనే టిటిడి ఈఓకు లేఖలు కూడా రాశారు. నా ముందు మీ వాదన నిజమని నిరూపిస్తే తనకు తగిన ఆధారాలు చూపించగలరా అంటూ అప్పట్లో సవాల్ విసిరాడు. అయితే తాజాగా హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానందసరస్వతి తిరుమలకు వచ్చిన సంధర్భంగా ఆంజనేయస్వామి జన్మస్థలంపై ఆయనకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది టిటిడి. 
 
టిటిడి పండితుల ఉన్నతస్థాయి కమిటీ ఛైర్మన్‌గా మురళీధర శర్మ ఆధ్వర్యంలో హనుమంతుడి జన్మస్థలంపై గోవిందానందసరస్వతితో చర్చించారు. నాలుగు నెలల పాటు పురాణ వాంగ్మయం, శాసన ప్రమాణాలను పూర్తిగా పరిశీలించిన తరువాతే హనుమంతుడు తిరుమలలోనే పుట్టాడని తాము నిర్థారించుకున్నట్లు టిటిడి కమిటీ గోవిందానందసరస్వతి దృష్టికి తీసుకెళ్ళాడు. అయితే దీనిపై ఆయన అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఆంజనేయస్వామి జన్మస్థలంపై తాను స్పష్టత ఇస్తున్నా టిటిడి ఒప్పుకోవడం లేదని విమర్సించారు గోవిందానందసరస్వతి. 
 
అంజనాద్రి పేరు కృతియుగానికి సంబంధించిందని హనుమంతుడి జన్మస్థలం కిష్కిందేనన్నారు. దీనికి సంబంధించిన సంపూర్ణ పురాణాన్ని టిటిడి సభ్యుల దృష్టికి తీసుకెళ్ళానని అయినా కూడా వారు వినిపించుకోలేదన్నారు. టిటిడి చూపించిన నివేదికలో హనుమంతుని జన్మతిథిని వారు చూపించలేదని.. వారు చూపించిన ఆధారాలన్నీ అవాస్తవమన్నారు. హనుమంతుడి జన్మస్థలంగా చెప్పబడే కిష్కింధకు రాకుండానే హనుమంతుడు తిరుమలలోనే పుట్టాడంటూ టిటిడి ఏ విధంగా చెబుతోందని స్వామి మండిపడ్డారు. 
 
అంతేకాకుండా గోవిందానందసరస్వతి మరింత కఠినమైన విమర్సలు చేశారు. తనతో చర్చించిన టిటిడి కమిటీ సభ్యుల అర్హతను ఆయన ప్రశ్నించారు. పెద్దజియ్యర్ స్వామిని ఎందుకు చర్చలో కూర్చోబెట్టలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పురాణాలు పరమప్రమాణం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని.. హనుమంతుడికి వివాహమైనట్లు టిటిడి ఒప్పుకుంటుందా అంటూ ప్రశ్నించారు. పురాణాలు చూపిస్తే టిటిడి ఒప్పుకోకపోగా టిటిడి చూపిస్తున్న 18 గ్రంథాల్లో కూడా ఆంజనేయుడి జన్మస్థలంపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. అసలు టిటిడి ఇచ్చిన నివేదికే తప్పుల తడకగా ఉందంటూ విమర్సించారు గోవిందానందసరస్వతి.
 
అయితే అంతేస్థాయిలో తమపై వచ్చిన విమర్సలకు సమాధానం చెబుతూనే గోవిందానందసరస్వతిపై విమర్సలు చేసింది టిటిడి పండితుల కమిటీ. గోవిందానందస్వామికి అన్ని ఆధారాలు చూపించామని.. అయితే వాటిని అర్థం చేసుకోవడానికి ఆయనకు అస్సలు సంస్కృతమే రాదంటూ విమర్సించారు టిటిడి కమిటీ సభ్యులు. అంతేకాకుండా ఆయనకు పురాణాల గురించే తెలియదని.. తాము చూపిస్తున్న ఆధారాలు ఒప్పుకోకుండా వితండవాదం చేస్తున్నారని విమర్సించారు. స్కంధ పురాణంలో ఆంజనేయుడు తిరుమలలోనే పుట్టాడని స్పష్టంగా ఉన్నప్పటికీ గోవిందానందస్వామి దానిని ఒప్పుకోకపోగా కిష్కింధలోనే పుట్టాడంటూ కొత్త బాష్యం చెబుతున్నాడంటూ మండిపడ్డారు.
 
అయితే గోవిందానందసరస్వతి విమర్సలతో మరోసారి ఆంజనేయుడి జన్మస్థలంపై వివాదం రేగుతోంది. ఇప్పటికీ టిటిడి చెబుతున్న విషయాల పట్ల అక్కడక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. అయితే ప్రామాణికంగా ఆంజనేయుడి జన్మస్థలం ఇది అంటూ స్పష్టంగా నిరూపించే ప్రయత్నం ఎవరు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments