అమావాస్య రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది. రామదూత అయిన హనుమంతుడు శివుని అంశంగా పరిగణింపబడతాడు.
రామాయణంలో శ్రీ మహావిష్ణువు రామునిగా, శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా కనిపిస్తారు. అలాంటి రామాయణంలో భాగం కావాలని శివునికి ఆశ ఏర్పడింది. అలాగే రామాయణంలో రామునికి సేవ చేయాలని శివుడు భావించాడు. తద్వారా శివుడు ఆంజనేయ స్వామిగా అవతరించి రామాయణంలో రామునికి సేవ చేశాడు. ఎక్కడంతా రామనామం వినిపిస్తుంటే.. అక్కడ ఆంజనేయ స్వామి అమరియుంటాడు.
రామునికి ఎక్కడ ఉత్సవం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి భక్తులతో భక్తుడిగా కలిసిపోతాడు. అలాంటి ఆంజనేయుడిని పూజిస్తే అనుకున్న కార్యాల్లో విజయం చేకూరుతుంది.
ఇంకా మంగళవారం పూట అమావాస్య రోజు ఆంజనేయ స్వామిని పూజించే వారికి సర్వ మంగళం చేకూరుతుంది. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అమావాస్య రోజున తమలపాకుల మాల, వడమాల, వెన్నతో అభిషేకాన్ని హనుమకు చేయిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయి.