సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.
సోమావతి కథలోకి వెళ్తే.. ఒకానొక ఊరిలో ఓ సాధువు ఓ వ్యాపారి కుటుంబానికి వస్తూ వుండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని పెళ్లికాని ఓ కన్యను ముఖం చూసి దీవించకుండానె వెళ్లిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం.. జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో ఆ కన్య జాతకం చూసిన జ్యోతిష్యుడు.. ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలంలోనే మరణిస్తాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులకు ఆ జ్యోతిష్యుడు పరిష్కారం కూడా చెప్తాడు.
సింఘాల్ ప్రాంతంలోని ఓ చాకలి స్త్రీ వద్ద కుంకుమ అడిగి నుదుటన ధరిస్తే కన్యకు దోషం పోతుందంటాడు. ఇదే తరహాలో చాకలి స్త్రీ వద్దకు చేరుకున్న ఆ కన్య సోమావతి అమావాస్య రోజున ఆమె వద్ద కుంకుమ పొందుతుంది. ఆపై రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసింది. ఆమె జాతక దోషం కూడా అంతటితో తొలగిపోతుంది.
అందుకే సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం.