ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన కల్పించటానికి ఈ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని తెలియజేసే దిశగా ఈ రోజును జరుపుకుంటారు. పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం ఆవశ్యకతను ఈ రోజు తెలియజేస్తుంది.
ఆరోగ్యంగా వుండేందుకు వ్యాయామాలు చేస్తూ.. పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆరోగ్యంగా వుండాలంటే పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలను కరోనా ప్రస్తుతం పట్టిపీడిస్తుంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా సెకండ్ వేవ్ బారిలో భారీ సంఖ్యలో పడుతున్నారు. కరోనా రాకాసి చేతిలో అనేకమంది ఇప్పటికే బలైపోయారు.
చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ ద్వారా రెండేళ్ల పాటు జనం నానా తంటాలు పడుతున్నారు. కోవిడ్‌పై వున్న భయంతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా కరోనా నియమాలను పాటిస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచ దేశ ప్రజలను కోవిడ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా వుండాలని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు.
కరోనా వచ్చిందని.. కొందరు భయపడితే చాలామంది వ్యాధులకు దూరంగా ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారు. మంచి జీవన శైలితో పాటు, వైద్యం సకాలంలో అందడం ఇందుకు కారణం. కరోనా నేర్పిన పాఠంతో ప్రపంచ జనాలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినా అసమానతలకు తావివ్వకుండా.. ఆర్థిక, లింగ, వర్గ తారతమ్యాలు లేని నిష్పాక్షికతతో కూడిన వైద్యం అందరికీ అందాలి.. మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జన్మహక్కుగా మారాల్సిన అవసరం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉద్ఘాటిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ సమన్యాయంతో కూడిన ఆరోగ్యం అందించాలని పిలుపునిచ్చింది. దాదాపు 70 సంవత్సరాలగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడో తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూనే ఆయా అంశాలపై ఆరోగ్య వ్యూహకర్తలకు దిశా నిర్దేశం చేయడం, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం చేస్తోంది.
గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, చర్మ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని వాటి బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. ఆహారం- వ్యాయామంపై దృష్టిపెట్టాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంటోంది. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సూచనలు చేస్తోంది.