Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల జగన్ పాలన: ‘అభివృద్ధి’ అంటే ఏమిటో జగన్ ప్రభుత్వం చెప్పిన కొత్త నిర్వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (15:57 IST)
సంక్షేమం ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా అనే ప్రశ్న.. ఆ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలనే సమాధానం.. రెండూ చాలాకాలంగా వింటూ ఉన్నవే. సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. "నాలుగు బిల్డింగ్‌లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు" అనేది సరికొత్త నిర్వచనం.

 
మరి, జగన్ ప్రభుత్వం అలాంటి అభివృద్ధినే కొనసాగిస్తుందా?
ఇలాంటి 'బాగు' తాత్కాలికంగా మేలు చేసినా అది ఉపాధి కల్పనతో కూడిన అభివృద్ధితో జత కలవకపోతే దీర్ఘకాలంలో నష్టం చేస్తుందన్న విషయం జగన్‌కు తెలియదని అనుకోవాలా? ఈ తాయిలాలను వదులుకునేందుకు ప్రజలు సిద్ధంగాలేనప్పుడు అప్పులు తెచ్చి ఇలా పంచుతూ పోవటం పులిమీద స్వారీ అవుతుందా?

 
ఆంధ్రప్రదేశ్‌లో 2019 శాసనసభ ఎన్నికలలో 86 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించుకొని అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఎంతో నమ్మకం పెట్టుకున్న రాష్ట్ర ప్రజలు ఆశతోను, దేశంలోని మిగతా రాష్ట్రాలవారు ఆసక్తితోను ఈ పాలనను గమనిస్తూ వచ్చారు. 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చామని ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, 85 శాతానికి పైగా కుటుంబాలు లబ్ధిపొందినట్టు చెపుతున్నా ప్రభుత్వం చేయాల్సింది ఎప్పటికీ సశేషమే. అందుకే ప్రశంసలతోబాటు విమర్శలూ స్వీకరించి అందులో సారాన్ని బేరీజు వేసుకొని ముందుకు సాగినప్పుడే ప్రభుత్వం తన ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసుకోగలుగుతుంది.

 
పాదయాత్రా ప్రతిఫలం
జగన్ పాదయాత్ర ఒక అసాధారణ, అరుదైన ఘట్టం. ఎక్కడికక్కడ ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా చూస్తూ, వాళ్ల మాటలు వింటూ, వాళ్లను ఓదార్చే క్రమంలోనే వాళ్లకు ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి రావటం.. ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాలు సహా అనేక పథకాలకు నేపథ్యం అని జగనూ ఆయన సన్నిహితులు చెప్పే మాట. ఎన్నికల మానిఫెస్టో రూపకల్పనకు సైతం అదే ప్రాతిపదిక అని వారు ఎన్నో సార్లు చెప్పి ఉన్నారు. అంతటితో ఆగకుండా, ఘనవిజయం సాధించిన తరువాత ఆ మానిఫెస్టో ను తూచా తప్పకుండా అమలు చేయటమే లక్ష్యంగా చెప్పుకోవటం, రెండేళ్ల తరువాత కూడా ధైర్యంగా, గర్వంగా "ఇచ్చిన మాటకే పెద్దపీట!" అనగలగటం కచ్చితంగా సానుకూలమైన అంశమే.

 
‘విద్య, వైద్య రంగాలకు పెద్దపీట అభినందనీయం’
విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయటం ద్వారా సంక్షేమ ప్రభుత్వఫు ప్రాధామ్యాలు స్పష్టమయ్యాయి. ఇది ప్రభుత్వ ప్రతిష్టను పెంచిన అంశం. పిల్లలకు తాను ఇచ్చే ఆస్తి చదువేనంటూ అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యాకానుక, మనబడి నాడు-నేడు, అంగన్వాడీలు..ఇలా రకరకాల పేర్లతో భిన్న వయోవర్గాలకు ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకొని పథకాలు అమలు చేయటం ద్వారా విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యం చాటుకున్నట్టయింది.

 
ఇందులో కొన్ని పాత పథకాలకు మెరుగులు దిద్దటమే కావచ్చుగాని కచ్చితంగా ఇవన్నీ పురోగామి చర్యలు. ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో ఇంగ్లిష్ మీడియం లాంటి నిర్ణయాల అమలు విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా, ఆ ఆలోచనను ఎవరూ పూర్తిగా తప్పుపట్టలేకపోయారు. ప్రైవేట్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పిల్లలకూ యూనిఫాం, బెల్ట్, షూ, సాక్స్ ఇవ్వటం, అన్ని పుస్తకాలూ ఒకేసారి అందజేయటం లాంటివి ఆ లేత మనసుల్లో ఎంత ఆత్మవిశ్వాసం పెంచుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 
వైద్య రంగం విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చింది. రాజశేఖర రెడ్డి హయాంలో మొదలై ఆయనకు విశేషంగా పేరుతెచ్చిపెట్టిన ఆరోగ్యశ్రీకి సహజంగానే జగన్ మెరుగులు దిద్దారు. 5 లక్షలలోపు సంవత్సరాదాయం ఉన్నవాళ్లందరికీ వర్తింపజేయటంతోబాటు కరోనా సహా 2,400 జబ్బులను ఆరోగ్య శ్రీ కిందికి చేర్చటం, సగటున మండలానికి రెండేసి అంబులెన్స్‌ల ఏర్పాటు వైద్య రంగం మీద శ్రద్ధను చాటాయి.

 
ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకా ఇస్తామని చెప్పి అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్టయింది. అదే విధంగా ఒకే రోజు14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయటం ద్వారా వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటుకున్నట్టయింది. వ్యవసాయ రంగానికి సాయం చేసే క్రమంలో రైతులకు పెట్టుబడి సాయం అందించటం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, పొలాల్లోనే పంట కొనుగోలు, భూమి రిజిస్ట్రేషన్లు సరళతరం చేయటం, సర్వే కోసం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టటం, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అమలు చేయటం చూశాం.

 
ఈ పథకాలన్నిటిలో ముఖ్యంగా గమనించిన ఒక వాస్తవం ఏంటంటే అధికార పార్టీ వాళ్లకే ఇస్తున్నారన్న విమర్శలు గత ప్రభుత్వంలో వచ్చినన్ని రాకపోవటం. పథకాల అమలులో ఇదొక ఆహ్వానించదగిన పరిణామం. మహిళాసంక్షేమానికీ పెద్దపీట వేసిన ఘనత జగన్ సొంతం చేసుకున్నారు. మహిళల భద్రతకు భరోసా ఇస్తూ 'దిశ' బిల్లు రూపొందించటం యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. అడుగడుగునా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వటమే కాదు, పథకాల లబ్ధిదారులలో మహిళల వాటా ఏ మాత్రమూ తక్కువ లేదని చాటుకోవటానికి బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వం సొంతం చేసుకుంది.

 
‘సకల జనుల సంక్షేమం’
సకల జన సంక్షేమం పేరుతో వ్యక్తిగతంగా వీలైనంత ఎక్కువమందికి నగదు రూపంలో లబ్ధి చేకూరాలన్న తాపత్రయం అడుగడుగునా కనబడుతుంది. అందుకే రెండేళ్లలో దాదాపు రూ. లక్ష కోట్ల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేశారు. అవి రకరకాల పెన్షన్లు కావచ్చు, డ్వాక్రా మహిళలకిచ్చే వడ్డీ కావచ్చు, రైతు భరోసా కింద ఇచ్చిందీ, పంటరుణాల వడ్డీగా ఇచ్చిందీ, మత్స్య కారులకు, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, మత్స్యకారులకు, నేతన్నలకు, వాహనమిత్ర పేరుతో ఆటో, టాక్సీ డ్రైవర్లకు .. ఇలా ఎవరినీ వదలకుండా తాయిలాలు పంచుతూనే ఉన్నారు. ఏ పేరైతేనేం, ఏదో విధంగా ప్రతి ఒక్కరికీ నగదు రూపంలో లబ్ధి అందాలన్న ఏకైక లక్ష్యం కనబడుతుంది.

 
‘నెత్తిపై కేసుల కత్తి’
‘‘తలమీద కేసుల కత్తి వేలాడుతూ ఉంది కాబట్టి ఇబ్బంది కరమైన స్థితి వస్తే రాష్ర్టంలో ప్రజాబలాన్ని చూపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తనను తాను రక్షించుకునే మార్గంగానే ప్రజాధనాన్ని అడ్డగోలుగా పథకాల పేరుతో పంచిపెడుతున్నారు, అప్పులపాలు చేసి అభివృద్ధి లేకుండా చేసి తక్షణ ప్రయోజనాల కోసం భవిష్యత్తును పణంగగా పెడుతున్నారు’’ అనే విమర్శ ఉన్నది.

 
కానీ ఏ విమర్శలున్నా, కారణాలేమైనా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గతంలో ఎన్నడూ లేనంత మంది జేబుల్లోకి నెలనెలా ఏదో రూపంలో ప్రభుత్వం డబ్బు చేరుతున్న మాట అయితే వాస్తవం. అది జనం కొనుగోలు శక్తిని పెంచి తిరిగి సిస్టమ్ అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది అని ప్రభుత్వ అనుకూలుర వాదన. ప్రభుత్వ పాలనను ఇంటింటికీ చేర్చటం లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయటం దేశ చరిత్రలో ఒక అద్భుత ప్రయోగం.

 
ఇది కేవలం పార్టీ ప్రయోజనాలకోసమేననే విమర్శలు వచ్చినా, క్రమంగా దీని ఫలితాలు చూసినవారు ప్రతికూల వ్యాఖ్యలు చేయలేకపోయారు. అనేక సేవలు ప్రజల ముంగిట్లో అందుతున్నాయి. పోలవరం పనులు వేగం పుంజుకున్నాయి. ఎప్పటికప్పుడు ఆ పురోగతి కనబడుతూనే ఉంది. అయినా సరే, పూర్తి కావటానికి ఇంకొంత సమయం అవసరం. రాకెట్ ప్రయోగంలో 90 శాతం సక్సెస్ ఎలా ఉండదో, పోలవరంలోనూ పూర్తి ఫలితం వచ్చేదాకా దాన్ని విజయాల పద్దులో జమ వేయలేం. మద్యపాన నియంత్రణ విషయంలోనూ కొద్దిపాటి పురోగతి కనబడుతున్నా, ఫలితాలకోసం ఇంకా ఆగక తప్పదు. నియంత్రణకు తీసుకున్న చర్యలు చూస్తుంటే ఐదేళ్లలో లక్ష్య సాధన అనుమానంగానే ఉంది.

‘మౌలిక సదుపాయాల మాట లేనట్లే’
ఇక అభివృద్ధి అంటే పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు అనే భావన నుంచి కొంచెం దూరంగా జరిగినట్టే కనిపిస్తుంది. "నాలుగు బిల్డింగ్‌లు కడితే అభివృద్ధి జరిగినట్లు కాదు. నిన్నటికన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ రోజు కన్నా రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దానిని అభివృద్ధి అంటారు" అని రెండేళ్ల పాలన మీద ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో అభివృద్ధిని నిర్వచించటాన్ని బట్టి మౌలిక సదుపాయాల వంటివి ప్రభుత్వ ప్రాధామ్యాలలో లేవన్న సంగతి అర్థమవుతూనే ఉంది.
 
 
గత ప్రభుత్వంలాగా పెట్టుబడులు వస్తున్నట్టు హడావిడి చేయమని ఎవరూ చెప్పరుగాని, ఇప్పుడసలు అలాంటి పెట్టుబడులు వచ్చినట్టు, లేదా వస్తున్నట్టు కనబడటం లేదు. మూడు పారిశ్రామిక కారిడార్లు, ఒక విమానాశ్రయం, మూడు ఓడరేవులు, ఆరు ఫిషింగ్ హార్బర్లు అని లక్ష్యాల జాబితాలో చెప్పుకోవటం తప్ప ఏవి ఏ దశలో ఉన్నాయో స్పష్టత లేదు.
బందరు పోర్ట్ ఇంకా ముందడుగు వేయలేదు. మరోవైపు అప్పులు లేకుందా ప్రభుత్వాలు నడవలేవన్నది నిజమే అయినా, పెరుగుతున్న అప్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉన్నాయి. దీనికి కారణం అడ్డూ అదుపూలేని సంక్షేమ పథకాలే అంటే ఒప్పుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు.

 
పరిశ్రమల అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి సహజంగానే ఉపాధి కల్పనలోనూ ప్రభుత్వం పెద్దగా సాధించిందేమీలేదు. దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తే అందులో సగానికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలే. మిగిలినవాటిలోనూ దాదాపు 60 శాతం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలున్నాయి. కనీస వేతనం కూడా అమలు చేయకుండా నెలకు ఐదువేలు చేతిలో పెట్టే ప్రక్రియను ఉద్యోగం అని పిలవడం కష్టం.

 
స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఇచ్చిన శిక్షణవలన ఉద్యోగాలు పొందినవారి సంఖ్యనూ, మొత్తం శిక్షణ తీసుకున్నవారినీ పోల్చితే అసలు విషయం వెల్లడవుతుంది. ఆ కార్పొరేషన్ పేరులో వ్యాపారదక్షతలో శిక్షణ కూడా ఉన్నా, దాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. యువతకు ఆ శిక్షణ ఇవ్వట ద్వారా చిన్న పరిశ్రమలను, వ్యాపారాలను ప్రోత్సహించటంతోబాటు ఉపాధి అవకాశాలనూ మెరుగుపరచవచ్చునన్న ధ్యాస లేకపోవటం ప్రభుత్వ ఆలోచనావిధానంలో ఒక స్పష్టమైన లోపం.

 
‘వ్యవస్థలకు సంబంధించిన విషయాలు వ్యక్తిగతంగా తీసుకుంటే’
జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇసుక విధానంలో తప్పటడుగులు వేసింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. సరిదిద్దుకోవటంలోనూ పొరపాట్లు దొర్లాయి. ఇసుక విధానం రూపొందించటంలో ఆలస్యం జరిగింది. దానికి తోడు వరదలు రావటం కూడా సమస్యను జటిలం చేసింది. అనేక సందర్భాలలో కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావటం కూడా ప్రతిపక్షాల విమర్శలకు తావిచ్చినట్టయింది.

 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో పట్టుదలకు పోవటం, కోర్టు వరకూ వెళ్ళటం, తీర్పు వ్యతిరేకంగా రావటం ప్రభుత్వానికి అపప్రధ తెచ్చిపెట్టింది. వ్యవస్థలకు సంబంధించిన విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవటం వలన ఇలాంటి సమస్యలొస్తాయి. ఇది ప్రభుత్వానికి సంబంధించిన రాజ్యాంగపరమైన అంశం కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించాలి.

 
‘కోడెల నుంచి దేవినేని వరకు.. ’
కోడెలతో మొదలుపెట్టి దేవినేని ఉమా వరకూ వరుసగా తెలుగేశం నాయకులపై తీసుకుంటున్న చర్యలు పెడుతున్న కేసులు చూస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడతున్నదనేది ఒట్టి ఆరోపణ కాదు అని అర్థమవుతుంది. తెలుగుదేశం నాయకులను వెనకేసుకు రావడం కాదు కానీ వరుసగా ఒకరి తరువాత ఒకరిపై పగబట్టినట్టు వెంటాడుతుంటూ దానికి తనచేతిలోని అధికార వ్యవస్థలను వాడుకుంటూ ఉంటే తెలుగుదేశం నాయకులపై సానుభూతి లేని వారికి కూడా ఇదేం పద్ధతి అనిపిస్తుంది.

 
అధికారంలో ఉన్నవారు పగపట్టినట్టు వ్యవహరిస్తే ప్రజలు హర్షించరు. రఘురామరాజు వ్యవహారంలో, రెండు మీడియా సంస్థల విషయంలోనూ అంతే జరిగింది. పార్టీ పరంగా వ్యవహరించటానికి, ఒక ఎంపీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించటానికీ ఉండే తేడాను గుర్తించలేదు. ఒక ఎంపీ దిగజారి మాట్లాడినంత మాత్రాన ప్రభుత్వం కూడా ఆ స్థాయికి వెళ్ళకూడదు. ప్రభుత్వం తల్చుకుంటే ఎవర్నైనా ఏమైనా చేయగలదు అనే సంకేతం ఇవ్వడానికి తప్ప మొత్తం ఎపిసోడ్ చెపుతున్నదేమిటి?

 
ఆయన మాట్లాడింది సరైంది అని ఎవరూ అనరు గానీ ఒక ప్రజాప్రతినిధికే అలాంటి గతి తలెత్తితే ఇక మామూలు మనిషి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తి నిలబడే సాహసం చేయగలరా? ఇలాంటి భయం కలిగించడం ప్రజాస్వామ్యంలో వాంఛనీయమేనా? ఏ ప్రభుత్వంలోనైనా పొరపాట్లు సహజం. కానీ జరిగిన పొరపాటును ఒప్పుకోవటం, సరిదిద్దుకోవటం హుందాతనాన్ని చాటుతుంది.

 
ఇటీవల తిరుపతి రూయా ఆస్పత్రిలో జరిగిన సంఘటన అలాంటిదే. ఆ ప్రమాదం కంటే, దాన్ని ప్రభుత్వం హ్యాండిల్ చేసిన పద్ధతి మరిన్ని విమర్శలకు తావిచ్చింది. ఆక్సిజన్ అందక అంత పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు మరణించినప్పుడు రాజకీయం చేస్తున్నారంటూ మరణాల మీద హడావిడిగా స్పందించటం, ఆ తరువాత ఒప్పుకోవటం, మళ్ళీ జాబితా సరిగా లేదని ప్రతిపక్షాలు ఆరోపించటం, ముందు పదకొండు మంది మరణించారు అని చెప్పి వాదించి చివరికి సైలెంటుగా 23 మందికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వటం ఏ సందేశం పంపుతుంది? ఇది కేవలం సమాచారం దాచిపెట్టడం మాత్రమే కాదు, బుకాయించడం, అబద్ధమాడటం కూడా.

 
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో స్పందించిన తీరును రుయా విషయంలో ప్రదర్శించకపోవటం కచ్చితంగా ప్రభుత్వానికి మైనస్ మార్కే. ఇమేజ్ మేనేజ్మెంట్ అనేదాన్ని మరీ దూరం తీసికెళ్లి అనైతికమైన పద్ధతులకు దిగడం గొప్ప ఇమేజేమీ ఇవ్వదు.

 
‘ప్రతీకారం పెద్దరికం కాబోదు’
అసాధారణ విజయం మరింత బాధ్యతను, మరింత వినయాన్ని ఇవ్వాలి. రాష్ట్ర అధినేతకు కక్ష సాధింపులజోలికి పోని విశాల హృదయం ఉండాలి. గత పాలకులు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకుంటామనటం పెద్దరికం కాబోదు. పొరుగున తమిళనాడు కొత్తముఖ్యమంత్రి అంతకుముందు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఉన్న వైరాన్ని సైతం పక్కనబెట్టి అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తూ 'అమ్మ' బొమ్మతోనే కొత్త బోర్డులు పెట్టించటం, కొన్ని కమిటీలలో ప్రత్యేకంగా అన్నాడీఎంకే వారికి స్థానం కల్పించటం లాంటివి చూస్తున్నాం.

 
ఇది అన్నాడీఎంకేను బలహీనం చేసేందుకు, నోరెత్తకుండా చేసేందుకు దూర దృష్టితో స్టాలిన్ వేసిన ఎత్తుగడగా కొంతమంది విశ్లేషిస్తున్నా సరే, జగన్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం కచ్చితంగా పెద్దరికం అనిపించుకోదు. స్థానిక ఎన్నికలలో అనుకూల తీర్పు - తిరుపతి విజయం.. ఇవన్నీ సానుకూల సంకేతాలుగా కనబడుతున్నా, అధికార పక్షానికి ఘన విజయాలుగా పైకి కనిపిస్తున్నా అవి ఎంత తాత్కాలికమో గ్రహించాలి.

 
పార్టీకి అనుకూలంగా ఉన్నవన్నీ, లేదా పార్టీ కార్యకర్తలకు ఆనందం కలిగించేవన్నీ ప్రభుత్వ ఇమేజ్‌కి అనుకూలం అనుకుంటే పొరపాటే. పార్టీ కంటే ప్రభుత్వం చాలా పెద్దది. దాన్ని యావద్దేశం గమనిస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి ఆవేశం, కక్ష సాధింపులు లేనప్పుడే తటస్థుల మన్ననలు పొందగలుగుతుంది. ఈ రెండేళ్లపాలన తరువాత ఆత్మవిమర్శ చేసుకుని సరిదిద్దుకుంటారని ఆశించగలమా!
 
(అభిప్రాయాలు వ్యక్తిగతం)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments