Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత డయాబెటిస్ వస్తుందా?

కోవిడ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత డయాబెటిస్ వస్తుందా?
, సోమవారం, 31 మే 2021 (11:41 IST)
కోవిడ్ నుంచి కోలుకున్న సాధారణ రోగులు కూడా మధుమేహానికి గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కోవిడ్-19 వల్ల ఇలా జరుగుతోందని డాక్టర్లు అంటున్నారు. "కోవిడ్ సోకిన సుమారు 10 శాతం రోగుల్లో మధుమేహం లక్షణాలు కనిపిస్తున్నాయి" అని ముంబయిలోని కెమ్ హాస్పిటల్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్ షివానే చెప్పారు. "ఇది ఆందోళనచెందాల్సిన విషయమే" అన్నారాయన. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువ. కానీ, కోవిడ్ వల్ల మధుమేహం బారిన పడుతున్న కేసులూ ఉన్నాయని నిపుణులు ధ్రువీకరించారు.

 
కోవిడ్ బారిన పడిన తర్వాత చక్కెర స్థాయి ఎందుకు పెరుగుతుంది
కోవిడ్ వల్ల మధుమేహం ఉన్న రోగుల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కోవిడ్ చికిత్సలో తీసుకున్న స్టెరాయిడ్లు కూడా చక్కెర స్థాయిలను పెంచుతాయి. గతంలో మధుమేహం లేని వారు కూడా కోవిడ్ సోకిన తర్వాత అకస్మాత్తుగా ఒంట్లో చక్కెర స్థాయిలు పెరిగినట్లు చెబుతున్నారు.

 
కరోనా వలన మధుమేహం వస్తుందా?
కోవిడ్ సోకిన చాలా మంది రోగులు మధుమేహం లక్షణాలతో ఫిర్యాదు చేస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. దీనికి కారణాలను డాక్టర్ వెంకటేష్ షివానే వివరించారు. కరోనా వైరస్ ఏసీఈ -2 రిసెప్టర్‌లను ఊపిరితిత్తులకు అతుక్కునేలా చేసి వ్యాపిస్తాయి. ఇవే రిసెప్టర్‌లు క్లోమ గ్రంధిపై ఉండే బీటా కణాలపైనా ఉంటాయి. కరోనా వైరస్ ఈ బీటా కణాలపై దాడి చేయడంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడు శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. క్లోమంలో ఉత్పత్తయ్యే ఇన్సులిన్ శరీరంలో మధుమేహ స్థాయిలను నియంత్రిస్తుంది. కానీ, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతే, చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనిని నియంత్రించడానికి రోగికి ఇన్సులిన్ కానీ, ఇతర ఔషధాలు కానీ ఇవ్వాల్సి ఉంటుంది.

 
కోవిడ్ రోగుల్లో మధుమేహం రావడానికి గల మూడు కారణాలను బొంబాయి హాస్పిటల్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రాహుల్ బక్షి వివరించారు. చాలా సార్లు రోగులకు మధుమేహ సమస్యలు ఉన్నాయని గ్రహించరు. కానీ, రక్త పరీక్షలో మాత్రం వారి చక్కెర స్థాయిలు పెరిగినట్లు తెలుస్తుంది. కొన్ని సార్లు మధుమేహం బార్డర్ స్థాయిలో ఉంటే వారిని ప్రీడయాబెటిక్ అంటారు. కానీ, అలాంటి వారికి కరోనా సోకితే, వారి చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. మూడు నెలల పాటు సాధారణంగా ఉన్న హెచ్‌బీఏ-1సి రిపోర్టులు కూడా అకస్మాత్తుగా పెరిగిన చక్కెర స్థాయిలను సూచిస్తాయి.

 
"కరోనా సోకడం వల్ల మధుమేహం బారిన పడుతున్నట్లు మేం గమనించాం. ఈ వైరస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది" అని ఫోర్టిస్ హాస్పిటల్ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శ్వేతా బుద్యాల్ చెప్పారు. కోవిడ్ తర్వాత తలెత్తే సమస్యలతో ప్రతి వారం ఒకరో ఇద్దరో రోగులు తమ ఆసుపత్రికి వస్తున్నట్లు ఆమె తెలిపారు.

 
"కోవిడ్ వల్ల నాకు మధుమేహం వచ్చింది"
37 ఏళ్ల నితిన్ పరాద్కర్( పేరు మార్చాం) ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ఆయనకు కోవిడ్ సోకిన తర్వాత మధుమేహం లక్షణాలు కనిపించాయి. "నాకు చాలా తేలికపాటి లక్షణాలతో కోవిడ్ సోకింది. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు కూడా ఇవ్వలేదు. కానీ, కోవిడ్ నుంచి కోలుకోగానే, నా ఒంట్లో చక్కెర స్థాయిలు పెరిగినట్లు డాక్టర్లు చెప్పారు. నేను మూడు వారాల తర్వాత చూసుకునే సరికి నా చక్కెర స్థాయిలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. నేనిప్పుడు మధుమేహానికి కూడా మందులు వాడుతున్నాను" అని చెప్పారు.

 
కోవిడ్ తర్వాత వచ్చిన మధుమేహం జీవితాంతం ఉంటుందా?
కోవిడ్ వల్ల సోకే మధుమేహం గురించి డాక్టర్ వెంకటేష్ షివానే బృందం అధ్యయనం చేసింది. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగుల మధుమేహం స్థాయి 200-250 ఉండగా, అది కొన్ని కేసుల్లో 300-400 వరకు కూడా పెరిగేదని చెప్పారు. కుటుంబ చరిత్రలో మధుమేహం లేని వారికి కూడా కోవిడ్ తర్వాత మధుమేహం వచ్చినట్లు డాక్టర్ షివానే చెప్పారు.

 
"అయితే, కోవిడ్ సోకినప్పుడు వచ్చిన మధుమేహం కొన్ని రోజుల్లోనే తగ్గిపోతున్నట్లు గుర్తించినట్లు డాక్టర్ షివానే చెప్పారు. కానీ, టైప్ 2 డయాబిటిస్ రోగుల్లో మాత్రం చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉన్నట్లు చెప్పారు. దీని గురించి ఇంకా అధ్యయనాలు జరగాలని ఆయన అన్నారు.

 
స్టెరాయిడ్లు తీసుకోవడం వల్ల..?
కరోనాకు చికిత్స చేసేటప్పుడు ప్రాణాలను కాపాడటంలో స్టెరాయిడ్లు కీలక పాత్ర వహిస్తాయి. కానీ, వాటి వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. కోవిడ్ ఉన్నా లేకపోయినా కూడా స్టెరాయిడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది తగ్గించడానికి ఇన్సులిన్ ఇస్తారని డాక్టర్ బక్షి చెప్పారు. కోవిడ్ తగ్గాక కూడా రోగులు మధుమేహానికి మందులు తీసుకోవాలని ఆయన సూచించారు.

 
కోవిడ్ తగ్గిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
"మీకు కోవిడ్ తగ్గినంత మాత్రాన సంబరం చేసుకోవడానికి లేదు. మీకు మధుమేహం ఉన్నట్లయితే, మీరు యుద్ధం సగమే గెలిచినట్లు. కరోనాపై పోరాడటంలో శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడం చాలా కీలకం" అని డాక్టర్ షివానే అన్నారు. అందుకు డాక్టర్ షివానే కొన్ని సలహాలను ఇచ్చారు.

 
•కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరూ మధుమేహం ఉందేమోనని రక్త పరీక్ష చేయించుకోవాలి.
•ముఖ్యంగా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్న వారు ఈ పరీక్ష చేయించుకుని చక్కెర స్థాయిలను పరిశీలించుకోవాలి
•కోవిడ్ తగ్గిన 180 రోజుల్లో మధుమేహాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యం
•షుగర్ లెవల్స్ 70 - 180 మధ్యలో ఉండాలి
•హెచ్ బి 1 సి ( మూడు నెలల సగటు) 7 కంటే తక్కువ ఉండాలి

 
కోవిడ్ సోకిన మధుమేహ రోగులేమి చేయాలి?
మధుమేహ రోగులకు వొకార్ట్ హాస్పిటల్ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అల్తమాస్ షేక్ ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు.
 
•మధుమేహ రోగులు సరైన మోతాదులో సమయానికి ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా ఒకేసారి తినకూడదు.
•ప్రతి రెండు గంటలకొకసారి కొంచెం కొంచెం తింటూ ఉండాలి.
•జ్వరం కానీ, జలుబు కానీ, ఉంటే టమాటో లేదా పాలకూర సూప్ తాగవచ్చు.
•ఆకు కూరలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. మజ్జిగ తాగాలి.
•అల్పాహారంలో రెండు నుంచి మూడు కోడిగుడ్ల తెల్ల సొన తినవచ్చు.
•చికెన్, ఫిష్ కూడా తినవచ్చు.
•మధుమేహ రోగులు వేపుళ్ళు, తీపి పదార్ధాలు తినకూడదు.
•శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోకుండా తగినంత నీరు తీసుకోవాలి.

 
కోవిడ్ మధుమేహానికి దారి తీస్తోందా అనే అంశంపై లండన్ కింగ్స్ కాలేజి, ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ టీం ఒకటి అధ్యయనం చేసింది. దీని కోసం వారు కోవిడ్ యాబ్ అనే రిజిస్ట్రీను రూపొందించారు. "కోవిడ్ సోకిన ఎంత మందికి మధుమేహం బారిన పడ్డారో చెప్పడానికి కచ్చితమైన లెక్కలు లేవు" అని మొనాష్ యూనివర్సిటీ పరిశోధనకారుడు ప్రొఫెసర్ పాల్ జిమ్మెట్ చెప్పారు.

 
అయితే, కరోనా తగ్గిన తర్వాత చక్కెర స్థాయిలు తగ్గుతాయి, లేదో కూడా ఇంకా చెప్పలేమని అన్నారు. ఈ ధోరణిని పరిశీలించడానికే రిజిస్ట్రీని తయారు చేశామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రిజిస్టర్ లో 600 కేసులు నమోదైనట్లు సీనియర్ డైయాబెటాలజిస్ట్ డాక్టర్ వి మోహన్ చెప్పారు. ఈ సంఖ్య పెరుగుతోందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

World No Tobacco Day: స్మోకింగ్ మానేయాలనుకుంటారు కానీ మానలేకపోతారు, ఎలా?