కరోనా మహమ్మారి వందల మంది ప్రాణదాతలను బలితీసుకుంటోంది. రెండో ఉద్ధృతిలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 550 మంది వైద్యులు వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు భారత వైద్య మండలి (ఐఎంఏ) శనివారం వెల్లడించింది.
అత్యధికంగా ఢిల్లీలో 104 మంది డాక్టర్లు కరోనాతో మృతిచెందగా.. ఆ తర్వాత బిహార్‌లో 96 మంది, ఉత్తప్రదేశ్‌లో 53, రాజస్థాన్‌లో 42, గుజరాత్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 29, తెలంగాణలో 29, పశ్చిమ బెంగాల్‌లో 23, తమిళనాడులో 21 మంది వైద్యులు వైరస్ కారణంగా చనిపోయినట్లు ఐఎంఏ తెలిపింది.
అయితే, మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని వైద్య మండలి భావిస్తోంది. ఎందుకంటే.. ఐఎంఏ రికార్డుల ప్రకారం 3.5లక్షల మంది డాక్టర్లు ఇందులో సభ్యులుగా ఉండగా.. దేశవ్యాప్తంగా 12లక్షలకు పైనే వైద్యులు ఉన్నారు. ఇప్పటికే తొలి దశలో మొత్తం 748 మంది డాక్టర్లను మహమ్మారి పొట్టన పెట్టుకుంది. వైద్యులు పూర్తి స్థాయిలో టీకాలు తీసుకోకపోవడం అధిక మరణాలకు దారితీస్తుండొచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ అభిప్రాయపడ్డారు.