Webdunia - Bharat's app for daily news and videos

Install App

650 రూపాయల ట్విటర్ బ్లూ టిక్, ఒక కంపెనీకి ఒక్క రోజులో రూ.1.22 లక్షల కోట్లు నష్టం తెచ్చింది.. ఎలాగంటే?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (22:21 IST)
ట్విటర్ బ్లూ టిక్ విలువ 8 డాలర్లు... అంటే సుమారు రూ.650. కానీ ఆ బ్లూ టిక్ ఒక కంపెనీకి తెచ్చిన నష్టం ఎంతో తెలుసా... దాదాపు 15 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.1.22 లక్షల కోట్లు. అమెరికాకు చెందిన ఒక ఫార్మా కంపెనీకి ఒక ట్వీట్ తెచ్చిన నష్టం ఇది.

 
ఏం జరిగింది?
ట్విటర్‌లో డబ్బులు చెల్లించి ఇక ఎవరైనా బ్లూ టిక్ పొందేలా దాని కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఇటీవల కొత్త సదుపాయం తీసుకొచ్చారు. మొన్నటి దాకా వార్తా సంస్థలు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు వంటి వారికి మాత్రమే ట్విటర్ బ్లూ టిక్ ఇచ్చేది. అదీ ఖాతాను వెరిఫై చేసిన తరువాత మాత్రమే. కానీ ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత అందరికీ బ్లూ టిక్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇందుకు నెలకు 8 డాలర్లు చెల్లిస్తే చెల్లించాలి. దాంతో ఎవరైనా డబ్బులు చెల్లించి బ్లూ టిక్ తీసుకొనే వెసులుబాటు లభించింది. దీంతో ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ’ డూప్లికేట్ పేరుతో ఒకరు ట్విటర్ ఖాతాకు బ్లూ టిక్ కొనుక్కున్నారు.

 
బ్లూ టిక్ ఎలా నష్టం చేసింది?
వాస్తవానికి ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ’ అనేది అమెరికాకు చెందిన ఫార్మ కంపెనీ. కానీ ఇదే పేరు మీద ట్విటర్‌లో ఒకరు ఖాతా తెరిచారు. పైగా 8 డాలర్లు చెల్లించి దానికి బ్లూ టిక్ తెచ్చుకున్నారు. డయాబెటిస్ రోగులకు అవసరమైన ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను అమ్ముతూ ఉంటుంది ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ’. అయితే ట్విటర్‌లో ఇదే పేరుతో తెరిచిన డూప్లికేట్ ఖాతా ఒక ట్వీట్ చేసింది. ‘ఇకపై మేం అందరికీ ఉచితంగా ఇన్సులిన్ ఇస్తాం’ అనేది ఆ ట్వీట్ సారాంశం.

 
ఆ ట్వీట్ చేసిన తరువాత అసలు కంపెనీ ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ’ షేర్లు పడిపోయాయి. శుక్రవారం షేరు ధర సుమారు 4.37శాతం పడిపోయింది. 15 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయింది. ఇలా ఒక డూప్లికేట్ ఖాతా బ్లూ టిక్ కొనుక్కున్న ఫలితంగా ఒక కంపెనీకి రూ.లక్ష కోట్లకు పైగా నష్టం వచ్చింది. చివరకు ఆ కంపెనీ ట్విటర్‌లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

 
146 ఏళ్ల చరిత్ర... రూ.27 లక్షల కోట్ల విలువ
ఇలై లిల్లీ ఫార్మాకు 146 ఏళ్ల చరిత్ర ఉంది. అమెరికా సైన్యానికి చెందిన కల్నల్ ఇలై లిల్లీ 1876లో ఈ కంపెనీని ప్రారంభించారు. అమెరికాలోని ఇండియానా కేంద్రంగా సుమారు 120 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు సుమారు 37,000 మంది ఉద్యోగులున్నారు. 7 దేశాల్లో ఆర్ అండ్ డీ, తయారీ కేంద్రాలున్నాయి. డయాబెటీస్, క్యాన్సర్, హర్మోన్ డిఫిసెన్సీ వంటి వాటికి మందులు తయారు చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.27 లక్షల కోట్లు.
1993లో ‘ఇలై లిల్లీ’ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. 2016లో బెంగళూరులో ఔషధాల అభివృద్ధి కేంద్రం లిల్లీ కెపాబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది.

 
పెరుగుతున్న ‘నకిలీ’ బెడద
బ్లూ టిక్ కొనుగోలు చేసే సదుపాయం తీసుకొచ్చిన తరువాత ట్విటర్‌లో నకిలీ ఖాతాలతో ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. బుధవారం నుంచి బ్లూ టిక్‌ను కొనుగోలు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దాంతో గురువారం నుంచి ట్విటర్‌లో ‘వెరిఫై’ చేసిన నకిలీ ఖాతాలు కనిపించడం మొదలైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రముఖ బ్రాండ్స్ పేరు మీద ‘బ్లూ టిక్’తో నకిలీ ‘వెరిఫైడ్’ ఖాతాలు పుట్టుకొస్తున్నాయి. ఇవి చేసే ట్వీట్ల వల్ల అసలు ఖాతాదారులకు, ఇతర యూజర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, పెద్దపెద్ద కంపెనీల పేర్లను కాపీ కొడుతూ సృష్టించిన ఖాతాలు ట్విటర్‌లో కనిపిస్తున్నాయి. వీటిలో చాలా ఖాతాలను ట్విటర్ సస్పెండ్ చేసింది. ‘బ్లూ టిక్‌ను కొనుగోలు చేసే సదుపాయం’ మీద ముందుగానే చాలా మంది నిపుణులు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌ను హెచ్చరించారు. మోసగాళ్లు, ఇతరులకు నష్టం చేయాలని చూసే వాళ్లు దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

 
‘నకిలీ’ యాపిల్ ఖాతా సస్పెన్షన్
యాపిల్, నింటెండో, బీపీ వంటి పెద్ద కంపెనీల ‘నకిలీ బ్లూ టిక్’ ఖాతాలను ట్విటర్ సస్పెండ్ చేసింది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటి వారి పేర్ల మీద ఉన్న ‘వెరిఫైడ్’ నకిలీ ఖాతాలను కూడా ట్విటర్ తొలగించింది. అమెరికాలోని అరిజోనా గవర్నర్‌ రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కారీ లేక్ పేరు మీద ‘వెరిఫైడ్’ నకిలీ ఖాతాను తెరిచారు. తన ప్రత్యర్థి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి విజయాన్ని అంగీకరిస్తూ తన ఓటమిని ఆమె ఒప్పుకుంటున్నట్లుగా ఆ ‘నకిలీ’ ఖాతా ట్వీట్ చేసింది.

 
మస్క్‌కు సైతం ఇబ్బందులు
మరికొందరు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ పేరు మీద ఉన్న మరొక నకిలీ ఖాతా... ‘9/11 దాడుల’ మీద జోకులు వేసింది. మస్క్ పేరు మీద కూడా నకిలీ ‘వెరిఫైడ్’ ఖాతాలు పుట్టుకొచ్చాయి. రహస్య-కుట్ర సిద్ధాంతాలు వంటివి ప్రచారం చేసేవారు, ఫార్ రైట్ వింగ్ కార్యకర్తలు ‘బ్లూ టిక్‌ను కొనుగోలు చేసే’ సదుపాయాన్ని మిస్ యూజ్ చేస్తున్నారు. అమెరికాలో ‘రాజకీయ కుట్ర’ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ‘క్యూఅనన్’ వంటి సంస్థలు ‘బ్లూ టిక్’ కొనుగోలు చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన మనుషుల ఫొటోలతో ఖాతాను తెరిచిన వారు కూడా ‘బ్లూ టిక్’ తీసుకుంటున్నారు. ఇతర దేశాల్లోని రాజకీయ ఉద్యమాలను ప్రభావం చేసే విధంగా కొన్ని దేశాల్లోని వ్యక్తులు లేదా సంస్థలు ఈ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.

 
పేరు పక్కన ‘అఫిషియల్’
ఇటువంటి ‘ఫేక్ వెరిఫైడ్’ ఖాతాలను ట్విటర్ సస్పెండ్ చేస్తూ పోతుంటే మరొకవైపు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలైన ఖాతాలకు ‘అఫిషియల్’ అనే బ్యాడ్జ్‌ను ఇస్తున్నట్లు ట్విటర్ తెలిపింది. ఈ ‘బ్లూ టిక్’ సమస్యను ట్విటర్ ఎలా పరిష్కరిస్తుందో ఇప్పటి వరకు స్పష్టత లేదు. టెర్రరిస్ట్ దాడులు, కాల్పులు, ప్రకృతి విపత్తులు వంటి సమయాల్లో పోలీసులు, అధికారులు, జర్నలిస్టులు ట్విటర్ ద్వారా కచ్చితమైన సమాచారం ఇస్తుంటారు. నకిలీ ‘వెరిఫైడ్’ ఖాతాల వల్ల ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఒక సమాచారం కచ్చితమైనదా? కాదా? అని తెలుసుకునేందుకు చాలా మంది ట్విటర్‌ ఖాతాకు ఉండే బ్లూ టిక్ మీదనే ఆధారపడుతుంటారు. ఇప్పుడు ఆ బ్లూ టిక్‌ను ఎవరైనా కొనుక్కోగలగడం వల్ల అది గందరగోళానికి, సమస్యలకు దారి తీస్తోంది. ఈ విషయం మీద ట్విటర్‌ను సంప్రదించినా బీబీసీకి బదులు రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments