Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Mumbai: అక్కడ 60 వేల మంది కోటీశ్వరులు ఉన్నారు - 2030 నాటికి బిలియనీర్ల కేంద్రంగా మారనుందా?

Mumbai
, శనివారం, 29 అక్టోబరు 2022 (14:05 IST)
భారత్‌లోని 98 మంది సంపన్నుల దగ్గరున్న సంపద.. దేశంలోని 55.2 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సంపదతో సమానమని చెప్పింది ఆక్స్‌ఫామ్ నివేదిక. ఈ 98 మంది సంపన్నుల మీద ఒక్క శాతం పన్ను వేసినా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏడేళ్ల పాటు కొనసాగించవచ్చు. సంపద సంపన్నుల దగ్గర మాత్రమే కాదు.. సంపన్నులుండే నగరాల్లో కూడా పోగుపడుతోందని చెబుతున్నాయి విదేశీ సంస్థల నివేదికలు. ధనికులు- దారిద్ర్యం సహజీవనం చేస్తున్న ముంబయిలో ఇవి రెండూ సమానంగా పెరుగుతున్నాయని ఈ నివేదికలు పునరుద్ఘాటిస్తున్నాయి.

 
అతిపెద్ద మురికివాడ నుంచి
దేశంలోనే అతి పెద్ద మురికివాడ.. 520 ఎకరాల్లో పది లక్షల మంది నివసిస్తున్న చోట, సగటున 1440 మందికి ఒక టాయిలెట్ ఉందని ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక గుర్తించిన నగరంలో.. సంపద కుప్పలు కుప్పలుగా పోగుపడుతోందని గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్ ప్రకటించింది. 2030 నాటికి ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సంపన్నులు నివసిస్తున్న నగరాల జాబితాలో ముంబయి మూడో స్థానానికి చేరుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం ఈ జాబితాలో తొలి 20 స్థానాల్లో కూడా లేని నగరం .. మరో ఎనిమిదేళ్లలో మూడో స్థానానికి ఎలా చేరుతుందనేది ఆసక్తికరం.

 
రికార్డులు..
జనాభా పరంగానే కాదు.. సంపన్నుల సంఖ్య పరంగానూ ముంబయి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నగరంలో ఆర్థిక సేవలు, మీడియా, రియల్ ఎస్టేట్ విభాగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ మార్కెట్ క్యాపిటల్ పరంగా ప్రపంచంలోని పది అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్‌లలో ఉన్నాయని గ్లోబల్ సిటిజన్ నివేదిక ఇటీవల వెల్లడించింది. ఈ నివేదిక ప్రస్తావించిన సంపన్నుల నగరాల జాబితాలో ముంబయి 25వ స్థానంలో ఉంది. ముంబయిలో 60 వేల మంది కోటీశ్వరులు ఉన్నారు. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సంపద గలవారు 243 మంది ఉన్నారు. 

 
పది వేల కోట్ల రూపాయలకు పైబడిన సంపద ఉన్న వారు 30 మంది ఉన్నారని గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్ తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా సంపన్నులున్న నగరాల జాబితాలోనూ అగ్రస్థానంలోనూ నిలిచింది. సంపన్నులు ఎక్కువ మంది ఉన్న మొదటి పది నగరాల్లో ఐదు అమెరికన్ నగరాలు ఉన్నాయి. ఇందులో మొదటి స్థానంలో ఉంది న్యూయార్క్. ఆ తర్వాతి స్థానాల్లో టోక్యో, శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్ ఉన్నాయి. సంపన్నులు ఎక్కువగా ఉన్న నగరాలుగా చైనాలోని బీజింగ్, షాంఘైకు చోటు దక్కింది. ఆ జాబితాలో ఆఫ్రికా, దక్షిణా అమెరికా ఖండాల్లోని ఒక్క నగరం కూడా లేవు. దేశంలో సంపన్న నగరంగా ముంబయిని 2008లోనే గుర్తించింది ఆల్ఫా వరల్డ్ నివేదిక.

 
ఏమిటీ బొంబాయి కథ
ఏడు చిన్న చిన్న ద్వీపాల సమూహంగా ఏర్పడిన బొంబాయి నగరం.. 1995లో ముంబయిగా మారింది. 1661లో ఇంగ్లండ్ రాజు చాల్స్ -2 పోర్చుగల్ యువరాణి కేథరిన్ ఆఫ్ బ్రగంజాను వివాహంతో చేసుకోవడంతో పోర్చుగీస్ వాళ్లు ముంబయిని ఇంగ్లండ్ రాజుకి కట్నంగా ఇచ్చారు. 1668 మార్చ్ 27న రాయల్ చార్టర్ ప్రకారం ఇంగ్లండ్ ఈ నగరాన్ని ఈస్టిండియా కంపెనీకి సంవత్సరానికి పది పౌండ్లకు లీజుకు ఇచ్చింది. 1661లో బొంబాయిలో మొదలైన జనాభా విస్ఫోటం కొనసాగుతూనే ఉంది. దేశ ఆర్థిక రాజధానిలో సంపద, సంపన్నులే కాకుండా పేదలు, పేదరికం కూడా పెరుగుతోందంటోంది బిగ్గెస్ట్ స్లమ్స్ ఇన్ ద వరల్డ్ నివేదిక. గ్రేటర్ ముంబయిలో 41.3 శాతం మంది మురికివాడల్లో నివసిస్తున్నట్లు అంచనా.

 
90 లక్షల మంది మురికివాడల్లోనే..
ముంబయిలోని రెండు కోట్ల జనాభాలో 90 లక్షల మంది మురికివాడల్లోనే నివశిస్తున్నట్లు వల్డ్ పాపులేషన్ రివ్యూ తేల్చింది. ధారావి ఆసియాలోనే రెండో అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందింది. ధారావిలో ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 8 లక్షల 69 వేల 565 మంది జీవిస్తున్నారు. ఇది అసాధారణం. ఈ మురికివాడలో 5 వేల వ్యాపారాలు, 15 వేల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ మురికివాడలో అక్షరాస్యత 69 శాతంగా ఉంది. దేశంలో అతి పెద్ద మురికి వాడ ఉన్న ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలోనే దేశంలో అత్యంత సంపన్నులు నివసిస్తూ ఉండటం అభివృద్ధి, అసమానతలకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోందన్నారు ఆక్స్‌ఫామ్ సీఈఓ అమితాబ్ బెహర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగుల చవితి రోజు.. నాగమ్మ తల్లి ప్రత్యక్షం.. పుట్టలో కాదు.. బిందెలో?!