Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండల్లో స్కూలు.. మాస్టారు కోసం గుర్రం కొనిచ్చిన గ్రామస్థులు... మరి సీఎం జగన్ ఏం చేస్తారో?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (19:38 IST)
సాధారణంగా ఉపాధ్యాయులు బైక్‌పైనో, ఆటోలోనో, బస్సులోనో బడికి వస్తుంటారు. కానీ, ఈ మాస్టారు మాత్రం గుర్రం మీద వస్తారు. అదేదో సరదా కోసం కాదు. తప్పని పరిస్థితిలో ఆయన అలా రావాల్సి వస్తోంది.


తమ పిల్లల జీవితాలను బాగుచేసే మాస్టారి సౌకర్యం కోసం గ్రామస్థులే ఓ గుర్రాన్ని కొనిచ్చారు. విశాఖ జిల్లా పాడేరుకు చెందిన గంపరాయి వెంకట రమణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గెమ్మలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో ఆయన పనిచేస్తున్నారు. రోజూ గుర్రంపై బడికి వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పి సాయంత్రం తిరిగి వెళ్తారు.

 
ఊరికి దారిలేదు
విశాఖ ఏజన్సీ అంటే చుట్టూ పచ్చటి కొండలు. విసిరేసినట్లు ఉండే గిరిజన పల్లెలు. మండల కేంద్రానికి రావాలంటే కాలినడకే దిక్కు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలోని మారుమూల ప్రాంతాలలో ప్రయాణం ఎంతో ప్రయాసతో కూడుకున్నది. రోడ్లు సరిగా ఉండవు. ఒక్కో ఊరు చేరుకోవాలంటే ఎత్తైన కొండలు, లోయలు దాటుకుంటూ వెళ్లాలి. అడవి జంతువుల ప్రమాదం కూడా ఉంటుంది. గంటల తరబడి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. వెంకటరమణ పనిచేసే స్కూలు కూడా అలాంటి మారుమూల పల్లెలోనే ఉంది.

 
వెంకటరమణ పాడేరులో నివాసం ఉంటారు. పాడేరు నుంచి జీ.మాడుగుల మండలం గెమ్మల వరకూ ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తారు. అయితే, వర్షం వస్తే ఈ ప్రయాణం ఆటోలోనో, జీపుల్లోనో సాగుతుంది. ఇక గెమ్మలి గ్రామం నుంచి బడికి కాలినడకనే వెళ్లాలి. కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ దాదాపు 9 కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్లి పాఠాలు చెప్పాలి. మళ్లీ సాయంత్రం ఇంటికి అలానే తిరిగి రావాలి.

 
బడికి రూపం ఇచ్చి
గెమ్మలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెం, తోకరాయి గ్రామాలకు కలిపి ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. రెండు ఊళ్ల నుంచి కలిపి 57 మంది విద్యార్థులు ఇక్కడ ఐదో తరగతి వరకూ చదువుకుంటున్నారు. మొదటిసారి ఇక్కడికి వచ్చిన వెంకటరమణకు అసలు స్కూలు ఎక్కడ ఉందో కూడా అర్ధం కాలేదు. గ్రామస్థులను స్కూలు గురించి అడిగితే కప్పు వేయకుండా సగం నిర్మాణంలో ఆగిపోయిన మొండి గోడలను చూపించారు. దీంతో వెంకటరమణ ఊరి వారితో మాట్లాడి పెద్ద వరండా ఉన్న ఒక ఇంట్లో స్కూలును నడిపిస్తున్నారు.
 
 
2016లో ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. తొలుత గెమ్మలి పంచాయతీ పరిధిలోనే ఉన్న కొత్తూరుపాడులో పనిచేశారు. రెండు నెలల క్రితమే సుర్లపాలెం స్కూలుకు బదిలీపై వచ్చారు.

 
ఆగిపోయిన పాఠశాల భవన నిర్మాణం
''21వ శతాబ్దంలో కూడా కనీసం పాఠశాల భవనం కూడా లేకుండా పాఠాలు చెప్పడం సిగ్గు పడాల్సిన విషయం. రోడ్డు లేదు. కొండలు గుట్టలు దాటి రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మధ్యలో అడవి జంతువులు దాడి చేస్తాయని భయం. స్కూలు భవనం లేదు. ఎలా పాఠాలు చెప్పాలో అర్ధం కాలేదు. పిల్లలకు పాఠాలు చెప్పాలనే కుతూహలమే నన్ను నడిపిస్తోంది'' అని అంటున్నారు వెంకటరమణ మాస్టారు.

 
బడి మీద, పిల్లల మీద ఈ ఉపాధ్యాయుడికి ఉన్న ఆసక్తి, తపనా, అందుకోసం ఆయన పడుతున్న కష్టాలు చూసిన గ్రామస్థులే రూ.9,000 పోగుచేసి ఒక గుర్రాన్ని కొన్నారు. "మా పిల్లల భవిష్యత్తు కోసం మాస్టారు వెంకటరమణ పడుతున్న కష్టాన్ని చూశాం. ఎండైనా, వానైనా రోజూ వస్తున్నారు. పిల్లలతో కలిసి తింటారు. వారితో కలిసి ఆడుతున్నారు. మంచిగా చదువు చెబుతున్నారు. ఇంత చేస్తున్న ఆయన కష్టం తీర్చాలని భావించి అలా చేశాం" అని గ్రామస్థుడు పాంగి సీతారాం చెప్పారు.
 
గుర్రపు స్వారీ రాదు
సుర్లపాలెం చుట్టుపక్కల గ్రామాలకూ రోడ్లు లేవు. దాంతో, ఇక్కడి ప్రజలు గుర్రాల మీదే వెళ్తారు. కానీ, టీచర్ వెంకటరమణకు గుర్రపు స్వారీ రాదు. ఆయన గుర్రం ఎక్కడం, దానిపై వెళ్లడం గ్రామస్థుల నుంచి నేర్చుకున్నారు. రోజూ ఆయన గుర్రంపై వచ్చినా, అది నైపుణ్యంతో కూడిన గుర్రపు స్వారీ కాదు. కేవలం, గుర్రం ఎక్కి నెమ్మదిగా వస్తారు.

 
గుర్రం పోషణను గ్రామస్థులే చూస్తారు. రోజూ చాలా మంది గిరిజనులు తమ రోజువారీ పనుల కోసం గెమ్మలికి వెళ్తుంటారు. అలా ఉదయాన్నే వెళ్లేవారు ఈ గుర్రాన్ని తీసుకెళ్తారు. రోజూ టీచర్ వెంకటరమణ గెమ్మలకు వచ్చే సమయానికల్లా గుర్రం అక్కడ సిద్ధంగా ఉండేలా చూస్తారు. దాని మీద టీచర్ స్కూలుకు వస్తారు. స్కూలు దగ్గరే గుర్రాన్ని కట్టేసి మేత వేస్తారు. సాయంత్రం తిరిగి అదే గుర్రం మీద ఆయన గెమ్మల వెళ్తారు. రాత్రికి మళ్లీ ఆ గుర్రాన్ని ఎవరో ఒకరు గ్రామస్థులు తమ ఊరికి తీసుకెళ్తారు.
ప్రభుత్వం స్పందించాలి
సుర్లపాలెం ఒక్కటే కాదు.. విశాఖ ఏజెన్సీలో చాలా గ్రామాలకు రోడ్డు, కమ్యూనికేషన్, బడి, ఆసుపత్రి వంటి కనీస సదుపాయాలు లేవు. ఇవన్నీ అక్కడి చాలా గ్రామాల చిరకాల స్వప్నం. ''పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే నాకు ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా వచ్చి పాఠాలు చెబుతున్నా. నా ఇబ్బందులను గమనించి ఈ గ్రామస్థులు గుర్రాన్ని ఏర్పాటు చేశారు. నాలాంటి ఎందరో ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గ్రామాలకు రోడ్లు వేయాలి'' అని వెంకట రమణ మాస్టారు కోరుతున్నారు.

 
"స్కూలు భవనం లేకపోయినా మాస్టారే మా ఊరి పెద్దలతో మాట్లాడి ఒక వరండాలో పిల్లలకు చదువు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి స్కూలు భవనం కట్టించాలి. రోడ్డు సదుపాయం కల్పిస్తే చాలా గ్రామాలకు మేలు జరుగుతుంది" అని గ్రామస్థుడు పాంగి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments