ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ ముంగిట ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. గురువారం చెన్నైలో ఈ వేలం నిర్వహిస్తున్నారు. ఈ వేలం కోసం 1,097 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 814 మంది భారతీయులుగా కాగా, మిగతా 283 మంది విదేశీయులు. ఇప్పటికే చాలా జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను రిటెయిన్ ఆప్షన్ ద్వారా అట్టి పెట్టుకున్నాయి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు మాత్రం చాలా మంది ఆటగాళ్లను వదులుకున్నాయి. ఆ జట్లకు ఈ వేలం కీలకం కానుంది.
వేలానికి పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 207 మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. 863 మంది ఫస్ట్ క్లాస్ క్రికెట్, స్థానిక స్థాయిలో ఆడారు. 27 మంది ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 283 మంది విదేశీ ఆటగాళ్లలో వెస్టిండీస్ వాళ్లు (56 మంది) అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత అత్యధికంగా విదేశీ ఆటగాళ్లు ఆస్ట్రేలియా ( 42), దక్షిణాఫ్రికా (38), శ్రీలంక (31), అఫ్గానిస్థాన్ (30), న్యూజీలాండ్ (29), ఇంగ్లాండ్(21)ల నుంచి ఉన్నారు. యూఏఈ (9), నేపాల్ (8), స్కాట్లాండ్ (7), బంగ్లాదేశ్ (5), జింబాంబ్వే (2), ఐర్లాండ్ (2), నెదర్లాండ్స్ (1) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఐపీఎల్ ఆరంభం నుంచి చాలా ఏళ్ల పాటు రిచర్డ్ మెడ్లీ వేలం పాటను నిర్వహిస్తూ వచ్చారు. ఐపీఎల్ వేలం పాటకు ఆయన పేరు పర్యాయ పదంలా ఉండేది. వివిధ రంగాల్లో వేలం పాటలు నిర్వహించిన అనుభవం కూడా మెడ్లీకి ఉంది. అయితే, కొన్నేళ్లుగా హ్యూ ఎడ్మిడెస్ ఈ వేలం పాటను నిర్వహిస్తున్నారు. ఫ్రాంచైజీల యజమానులు, వేలానికి హాజరైనవారు, బీసీసీఐ యాజమాన్యంతో సమన్వయం చేసుకోవడం వేలం నిర్వాహకుల బాధ్యత.
ప్రతి ఆటగాడికీ కనీస ధర ఉంటుంది. ఒకటికి మించి జట్లు ఆ ఆటగాడిని కొనేందుకు ఆసక్తి చూపితే, వేలం మొదలవుతుంది. ఎక్కువ మొత్తం పాడిన జట్టుకు ఆ ఆటగాడు దక్కుతాడు. ఎవరూ ఆసక్తి చూపకపోతే ఆ ఆటగాడు అమ్ముడవ్వకుండానే మిగిలిపోతాడు. ఇలా మిగిలిపోయిన ఆటగాళ్లను చివర్లో మరోసారి వేలం వేస్తారు. వేలంలో ఎవరు అత్యధిక ధర దక్కించుకుంటారన్నది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇదివరకటి సీజన్లకు ముందు జరిగిన వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీళ్లే...
2019- జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి (చెరో రూ.8.4 కోట్లు)
2020- ప్యాట్ కమిన్స్ (రూ.15.5 కోట్లు)
ఎవరు తప్పుకున్నారు?
ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులుగా ఉన్న ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జేమ్స్ పాటిన్సన్ ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీం కూడా ఈసారి ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకోలేదు. ఈసారి వేలానికి వస్తున్న ఆటగాళ్లలో అందరి కన్నా కుర్ర ప్లేయర్ అఫ్గానిస్తాన్‌కు చెందిన నూర్ అహ్మద్ లఖన్వాల్. అతడి వయసు 16 ఏళ్లు. ఇక అందరికన్నా సీనియర్ ఆటగాడు 42 ఏళ్ల నయన్ దోషి.
వీరిపైనే చూపు...
గ్లెన్ మ్యాక్స్‌వెల్: హార్డ్ హిట్టర్‌గా మ్యాక్స్‌వెల్‌కు మంచి పేరు ఉంది. స్పిన్ బౌలింగ్‌తోనూ అతడు జట్టుకు కలిసివస్తాడు. మంచి ఫీల్డర్ కూడా. అయితే, అతడు స్థిరంగా రాణించలేకపోతున్నాడు. అందుకే కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాక్స్‌వెల్‌ను వదులుకుంది. ఇదివరకు అతడు ముంబయి, దిల్లీ జట్లకు కూడా ఆడాడు. తనదైన రోజున మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్నా, ఆటలో స్థిరత్వం లోపించడం వల్ల అతడిని తీసుకునేందుకు జట్లు వెనుకాడుతున్నాయి.
స్టీవెన్ స్మిత్: ఆస్ట్రేలియా తరఫున గొప్పగా ఆడే స్టీవెన్ స్మిత్ ఐపీఎల్‌లో మాత్రం ఇంతవరకూ పెద్దగా రాణించింది లేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇదివరకు కెప్టెన్‌గానూ ఉన్నాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా స్మిత్ విఫలమవ్వడంతో ఆ జట్టు అతడిని వదులుకుంది. అయితే, అతడికి నాయకత్వ పటిమ ఉంది. ఎలాంటి పిచ్‌పైనైనా పరుగులు రాబట్టగలడు. ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు.
ఫబియన్ అలన్: ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌ల్లో కీలకమైన ఆటగాళ్లలో ఒకడిగా ఫబియన్ పేరు తెచ్చుకున్నాడు. ఇది వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నా, బరిలోకి దిగే అవకాశం అతడికి ఎప్పుడూ రాలేదు. జట్టు కూర్పులో ఫబియన్‌కు స్థానం కుదరకపోతుండటంతో అతడిని హైదరాబాద్ వదులుకుంది. అలన్ ఆల్‌రౌండర్. పంజాబ్, బెంగళూరు వేలంలో అతడిని దక్కించుకునేందుకు ప్రయత్నించవచ్చు.
జేసన్ రాయ్: ఫ్రీ హిట్లకు రాయ్ పెట్టింది పేరు. వ్యక్తిగత కారణాలతో గత సీజన్‌కు అతడు దూరంగా ఉన్నాడు. ఇదివరకు రాయ్ దిల్లీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఓపెనర్‌గా, మంచి హిట్టర్‌గా అతడు పేరు తెచ్చుకున్నాడు. పవర్ ప్లేల్లో పరుగులు పిండుకోవడంలో రాయ్ నేర్పరి.
పీయూష్ చావ్లా: అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో సంపాదించుకున్న అనుభవమే పీయూష్ బలం. ఇదివరకు చెన్నై, కోల్‌కతా జట్ల తరఫున అతడు ఐపీఎల్‌లో ఆడాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పీయూష్‌ది మూడో స్థానం. ఇప్పటివరకూ అతడు ఈ లీగ్‌లో 156 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల పీయూష్‌కు గత సీజన్‌కు వచ్చిరాలేదు. కానీ, అతడిలాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడిని తీసుకునేందుకు జట్లు ఆసక్తి చూపించవచ్చు.
హర్భజన్ సింగ్: భారత్‌కు ఇప్పటివరకూ ఆడిన మేటి స్పిన్నర్లలో హర్భజన్ కూడా ఒకడు. ఐపీఎల్‌లోనూ అతడు బాగా రాణించాడు. చాలా ఏళ్ల పాటు ముంబయి జట్టుకు ఆడిన హర్భజన్... ఆ తర్వాత చెన్నైకి మారాడు. చెన్నై వదులుకోవడంతో ఈసారి మళ్లీ వేలంలోకి వచ్చాడు. 40 ఏళ్ల హర్భజన్ తన కెరీర్లో టెస్టుల్లో 417 వికెట్లు, వన్డేల్లో 269 వికెట్లు, ఐపీఎల్‌లో 150 వికెట్లు తీశాడు. కీలకమైన సమయంలో పరుగులకు అడ్డుకట్ట వేసి, వికెట్లు తీయడంలో అతడు నేర్పరి. వయసు కొంతవరకూ ప్రతికూలతగా కనిపిస్తున్నా... ఐపీఎల్ లాంటి పొట్టి ఫార్మాట్‌లో అదేమీ పెద్ద అడ్డంకి కాకపోవచ్చు.
కేదార్ జాదవ్: అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు జాదవ్. ఇదివరకు అతడు దిల్లీ, బెంగళూరు, కోచి, చెన్నై జట్ల తరఫున ఆడాడు. అయితే, చెన్నై ఇదివరకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడానికి జాదవ్ ఆట తీరు కూడా ఓ కారణమన్న నింద అతడిపై ఉంది. ఆ జట్టు అతడిని వదులుకోవడానికి కూడా అదే కారణమై ఉండొచ్చు. ప్రస్తుతం జాదవ్ వయసు 35 ఏళ్లు. అయితే, అతడు బ్యాటింగ్‌తోపాటు స్పిన్ బౌలింగ్‌తోనూ జట్టుకు ఉపయోగపడగలడు.
శివమ్ దూబె: అరుదుగా కనిపించే బౌలింగ్ ఆల్‌రౌండర్లలో శివమ్ దూబె ఒకడు. ఈ పొడగరి బౌలర్ ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు. అతడిని బెంగళూరు ఎందుకు వదులుకుందా అని చాలా మంది తికమకపడుతున్నారు కూడా. 27 ఏళ్ల ఈ యువ ఆటగాడిని తీసుకునేందుకు జట్లు పోటీపడొచ్చు.
క్రిస్ మోరిస్: బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్నింటిలోనూ మేటిగా మోరిస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడటంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌ల్లో ఆడిన అనుభవం అతడి సొంతం. మోరిస్ వయసు 33 ఏళ్లు. ఇటీవలే గాయపడ్డాడు కూడా. జట్లు అతడిని తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించవచ్చు.