బ్రెజిల్ దేశంలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు.. పాల్మాస్ ఫుట్ బాల్ క్లబ్ అధ్యక్షుడు లూకాస్ మైరా చనిపోయారు.
ఈ టీమ్ కోపా వర్డీ కప్‌లో భాగంగా మ్యాచ్ ఆడాల్సి వుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లను తీసుకుని వెళుతున్న ఓ చిన్న విమానం క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో లూకాస్ ప్రాక్సీడెస్, గుయ్ హెర్మే నోయ్, రానుల్, మార్కస్ మొలినారీ మరణించారని, విమానానికి పైలట్‌గా ఉన్న వాగ్నర్ కూడా కన్నుమూశారని బ్రెజిల్ విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
టుకాన్టినినెన్స్ ఏవియేషన్ అసోసియేషన్ నుంచి టేకాఫ్ తీసుకుంటున్న క్రమంలో సాంకేతిక లోపం ఏర్పడిందని, ఈ విమానం రన్ వే చివర కుప్పకూలిందని ప్రకటించిన పాల్మాస్ క్లబ్, ఆటగాళ్ల మరణం తమకు తీరని లోటని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని పేర్కొంది.
కాగా, విమాన ప్రమాదం పాల్మాస్‌కు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొయానియాకు జరిగింది. కాగా, ఇది ఏ మోడల్ విమానమన్న విషయాన్ని క్లబ్ వెల్లడించలేదు. బ్రెజిల్‌లో జరిగే విమాన ప్రమాదాల్లో ఫుట్ బాల్ ఆటగాళ్లు మరణించడం ఇదే తొలిసారేమీ కాదు.