Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్: భారత మీడియా చైనాను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (15:39 IST)
ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనావైరస్ ఇప్పుడు ఒక మహమ్మారిగా మారిన తర్వాత భారత మీడియా దీనికంతటికీ అసలు కారణం చైనానే అని ఆరోపిస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ అమలు చేస్తోంది. దీంతో, చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ వైరస్‌ను తయారు చేసి, దానిని ప్రపంచమంతా వ్యాపించేలా చేసిందని భారత మీడియాలోని చాలా సంస్థలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

 
దీని వెనుక డబ్ల్యుహెచ్ఓ పాత్రపై కూడా భారత మీడియా ప్రశ్నలు లేవనెత్తుతోంది. కరోనా వైరస్ వ్యాపించడం వెనుక చైనా కుట్ర ఉందనే వార్తలు భారత్‌లోని అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా విభాగాల్లోనూ జోరుగా వినిపిస్తున్నాయి. కరోనావైరస్‌తో పోరాటం కోసం దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు 21 రోజులు లాక్‌డౌన్‌లో ఉంచాలని మార్చి 24న భారత్ అసాధారణ నిర్ణయం తీసుకుంది.

 
దానితోపాటూ దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మహమ్మారి వ్యాపించడం వెనుక చైనా పాత్రపై దేశ మీడియా, నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

 
చైనా కుట్ర సిద్ధాంతం
భారత్‌లో చాలా మంది కరోనా వ్యాపించడానికి చైనానే కారణం అని భారత్‌లో చాలా మంది ట్విటర్, మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో పోస్టులు పెడుతున్నారు. చైనా అమలు చేసిన ఒక వ్యూహమే కరోనా అనే సిద్ధాంతం ఇటీవల బ్లాగ్స్, సోషల్ మీడియా, సంచలన వార్తలకు పాకులాడే టీవీ చానళ్ల వరకే పరిమితమైంది.

 
కానీ ఇప్పుడు భారత్‌లోని కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా ఇదే చర్చ మొదలైంది. ఈ కరోనావైరస్ చైనా జీవాయుధాలకోసం చేసిన పరిశోధనల ఫలితంగా పుట్టిందేమో అంటున్నారు. కరోనా వైరస్ బయటపడిన తర్వాత ప్రారంభ దశలో భారత్‌లోని టాప్ మీడియా సంస్థలన్నీ తమ కవరేజీలో చైనా ప్రభుత్వం గురించి చాలావరకూ పూర్తి సంయమనంతో వ్యవహరించాయి.

 
అయితే, కొన్ని హిందీ న్యూస్ చానళ్లు చైనా తన బయోలాజికల్ రీసెర్చ్ ద్వారా కోవిడ్-19 వైరస్‌ను తయారు చేసిందని ఆ దేశంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు, ప్రముఖ భారత మీడియా అవుట్‌లెట్స్ చైనాలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులను అక్కడ నుంచి స్వదేశానికి తీసుకురావడంపై ఫోకస్ పెట్టాయి.

 
అయితే, భారత్‌లో ప్రస్తుతం అమలు అవుతున్న 21 రోజుల లాక్‌డౌన్ సమయంలో ఇప్పుడు కొన్ని ప్రామాణిక మీడియా అవుట్‌లెట్స్, నిపుణులు కూడా చైనాకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలపై చర్చిస్తున్నారు. ఈ చైనా తన బాధ్యతను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

 
చైనాపై ఆరోపణలు
కరోనా వైరస్‌ను నియంత్రించే పద్ధతుల గురించి భారత ప్రభుత్వం చైనాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. కానీ దేశంలో కొన్ని ప్రభావవంతమైన మీడియా అవుట్‌లెట్స్ ఈ మహమ్మారి వ్యాప్తి వెనుక చైనా జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి.

 
“భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్, చైనా విదేశాంగ మంత్రితో వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు” అని మార్చి 24న భారత్‌లో చైనా రాయబారి సూన్ విడాంగ్ ఒక ట్వీట్ చేశారు. ఇందులో కరోనా వైరస్‌ను చైనా వైరస్ అనకుండా ఉంటామని భారత్ అంగీకరించింది. అయితే, భారత మీడియా మాత్రం రకరకాలుగా చైనాపై విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో పరిస్థితులను సరిగా హ్యాండిల్ చేయలేదనే విషయం నుంచి, వైరస్‌ను ఆ దేశమే సృష్టించిందని, దాన్ని మొత్తం ప్రపంచమంతా వ్యాపించేలా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

 
భారత్‌లో మార్చి 25న లాక్‌డౌన్ మొదలైన తర్వాత ‘చైనీస్ వైరస్’, ‘చైనీస్ వైరస్19’ లాంటి హ్యాష్‌టాగ్‌లతో భారతీయులు జోరుగా పోస్టులు చేశారు. వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వ్యాపించడానికి చైనానే కారణమని, ఆ దేశాన్ని దోషిగా చెప్పారు.

 
ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం
ప్రముఖ రక్షణ వ్యూహాల అంశాల విశ్లేషకులు నితిన్ ఎ గోఖలే “వైరస్ వ్యాపించేలా చైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. అది మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలో పడేసింది. దానికి చైనా ప్రపంచానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చైనా వైరస్ వ్యాప్తి, దాని ప్రభావం చూస్తుంటే ఇది మానవాళికి వ్యతిరేకంగా చేసిన ఒక నేరంగా భావిస్తున్నారు” అన్నారు.

 
ప్రముఖ దినపత్రిక దైనిక్ జాగరణ్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో “జీవాయుధాల కోసం చైనా చేసిన పరీక్షల ఫలితంగా కరోనావైరస్ పుట్టిందని చెప్పడం చాలా కష్టం. కానీ, వైరస్ రీసెర్చ్ కోసం చైనా వుహాన్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగశాల నిర్మించిందనే వాస్తవాలను కొట్టి పారేయలేం” అన్నారు. కరోనావైరస్ వుహాన్ నగరం నుంచే మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది. అదే ఆర్టికల్‌లో “చైనా ప్రభుత్వ మీడియా కూడా ఈ ప్రయోగశాల గురించి ప్రగల్భాలు పలికింది” అని రాశారు.

 
సంక్షోభం ద్వారా సంపాదన
ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానల్ ఇండియా టుడే యాంకర్ శివ్ అరూర్ చైనా ఈ వైరస్‌ను తయారు చేసిందనే ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే చైనా మిగతా దేశాలకు మందులు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తోందని చెప్పారు.

 
చైనాను ఒక విశ్వాసఘాతక దేశంగా వర్ణించిన శివ్ అది ఇప్పుడు మొత్తం ప్రపంచానికే ప్రమాదంగా మారిందని అన్నారు. మొదట ఒక సంక్షోభాన్ని సృష్టించడం, ప్రపంచమంతా ఆ సంక్షోభంలో విలవిల్లాడుతున్నప్పుడు, ఆ పరిస్థితి నుంచి డబ్బు సంపాదించే ఎజెండాతో చైనా ముందుకు వెళ్తోందని ఆరోపించారు.

 
చైనాతో కలిసిందని డబ్ల్యుహెచ్ఓపై ఆరోపణ
భారత్‌లో అధికార బీజేపీ కరోనావైరస్‌ వ్యాప్తికి సంబంధించి చైనా మీద ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. కానీ “పరిస్థితులు ఇలా ఘోరంగా మారడానికి చైనా, డబ్ల్యుహెచ్ఓ కలిసిపోవడమే కారణం” అని బీజేపీకి చెందిన ఒక అనుబంధ సంస్థ విమర్శించింది.

 
డబ్ల్యుహెచ్ఓ ఈ వైరస్ బయటపడిన వెంటనే దానికి చైనా వైరస్ అనే పేరు పెట్టుండాలి అని స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్‌జేఎం) చెప్పింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎస్‌జేఎం ఆర్థిక అంశాల్లో సలహాలు ఇస్తుంది.

 
“వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాత్రపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ బయటపడగానే, అది మనిషి నుంచి మనిషికి వ్యాపించలేదని చెప్పిన చైనా మాటలను డబ్ల్యుహెచ్ఓ నమ్మింది. కానీ ఇప్పుడు మనుషులు ఒకరిని ఒకరు తాకితే అది వ్యాపిస్తుందని తేలింది. డబ్ల్యుహెచ్ఓ చైనాను క్షమాపణ ఎందుకు అడగడం లేదు? ఈ వైరస్‌కు చైనా వైరస్ అనే పేరు ఎందుకు పెట్టడం లేదు?’’ అని ఎస్‌జేఎం జాతీయ కన్వీనర్ అశ్వినీ మహాజన్ ఇంగ్లిష్ న్యూస్ వెబ్‌సైట్ దప్రింట్‌తో అన్నారు.

 
చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ మీదా ప్రశ్నలు
వైరస్ వ్యాపించడంలో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్ఐ) పాత్రపై కూడా అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని మహాజన్ డిమాండ్ చేశారు. చైనా బీఆర్ఐ భాగస్వామిగా ఉన్న దేశాల్లో ఈ వైరస్ వల్ల జనం భారీ సంఖ్యలో చనిపోతున్నారని అన్నారు. ఆ దేశాల్లో ఇరాన్, ఇటలీ కూడా ఉన్నాయి.

 
“చైనా అనైతిక విధానాలతో ఈ వైరస్‌ వ్యాపించేలా చేసింది. అందుకే, ఇప్పుడు మొత్తం ప్రపంచం ప్రమాదంలో పడింది” అని మహాజన్ అన్నారు. భారత్‌లోని చాలా మంది నిపుణులు డబ్ల్యుహెచ్ఓను బోనులో నిలబెడుతున్నారు. ప్రముఖ వ్యూహాత్మక అంశాల నిపుణులు సమీర్ సరన్ తన ఒక వ్యాసంలో “డబ్ల్యుహెచ్ఓ ఈ సంక్షోభంపై చాలా అలసత్వ విధానాలతో స్పందిస్తోందని” అన్నారు.

 
చైనా డబ్ల్యుహెచ్ఓ లాంటి అంతర్జాతీయ సంస్థలపై తన ఆధిపత్యం పెంచుకుంటోందని సీనియర్ జర్నలిస్ట్, వ్యాఖ్యాత శేఖర్ గుప్తా తన యూట్యూబ్ చానల్లో చెప్పారు. ‘‘చైనా సత్ప్రవర్తన గురించి ఎప్పుడూ సర్టిఫికెట్లు ఇస్తూ వచ్చిన డబ్ల్యుహెచ్ఓ, ఇప్పుడు క్వారంటైన్ చర్యలకు వ్యతిరేకంగా మొత్తం ప్రపంచానికే లెక్చర్లు ఇస్తోంది. ఇవి పరిస్థితిని మరింత ఘోరంగా మారుస్తాయని అంటోంది” అన్నారు.

 
చైనాపై ప్రాపగాండా కాంపైన్ ఆరోపణ
వైరస్ వ్యాపించిన తర్వాత నుంచి భారత్‌లోని చాలా మంది వ్యాఖ్యాతలు, మీడియా అవుట్‌లెట్స్ నుంచి చైనా ఇప్పుడు అబద్ధాలు చెప్పి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. “చైనా ఇప్పుడు మొత్తం ప్రపంచానికే ఒక గ్లోబల్ లీడర్‌గా తనను రీబ్రాండింగ్ చేసుకోడానికి దూకుడుగా ప్రయత్నిస్తోందని” ప్రముఖ వ్యూహాత్మక అంశాల నిపుణులు బ్రహ్మా చెల్లానీ ఇంగ్లిష్ న్యూస్ మ్యాగజీన్ ‘ఓపెన్‌’లో అన్నారు.

 
చైనా పబ్లిక్ డిప్లొమసీలో ట్విటర్, మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ఉపయోగించడం ఉంటుంది. వాటి ద్వారా అది తప్పుడు, అబద్ధపు సూచనలను జారీ చేస్తూ మొత్తం ప్రపంచంలో జరిగేవాటిని ప్రభావితం చేయాలని చూస్తోంది. ఇంగ్లిష్ న్యూస్ చానల్ వాయోన్ తన రిపోర్టులో “కరోనావైరస్ వల్ల తనకు వ్యతిరేకంగా వస్తున్న విమర్శలకు చురుకుగా సమాధానం ఇవ్వడానికి చైనా తన ప్రాపగాండా మెషినరీని ఉపయోగిస్తోంది” అని చెప్పింది.

 
అది తన రిపోర్టులో “చైనా ప్రాపగాండా మెషినరీకి భారీ సంఖ్యలో సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. చైనాను సమర్థించే కంటెంట్‌ను అవి ప్రపంచమంతా ప్రచారం చేస్తాయి” అని చెప్పారు. “చైనా 2016లో ప్రారంభించిన ఒక కార్యక్రమం కూడా ఈ మెషినరీలో భాగంగా ఉంది. అందులో చైనా విదేశీ జర్నలిస్టులకు 10 నెలల శిక్షణ ఇస్తుంది. ఈ కార్యక్రమం కింద ఎంతోమంది విదేశీ జర్నలిస్టులు గతకొన్నేళ్లుగా చైనా వెళ్లి వచ్చారు” అని ఇదే రిపోర్టులో చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments