కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్, బీమా రంగాల ప్రైవేటీకరణ దిశగా కీలక ప్రకటన చేశారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్నట్లు తెలిపారు. ప్రీ బడ్జెట్ సంప్రదింపుల్లోనే రెండు లేదా మూడు బ్యాంకులను ప్రైవేటీకరిస్తారన్న అభిప్రాయాలు వచ్చాయి. యూకోబ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను ప్రైవేటీకరించే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అలాగే, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ప్రైవేటీకరించనున్నట్లు తేల్చి చెప్పారు.
ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవడానికి ఆయా సంస్థలు బహిరంగ మార్కెట్లో ప్రకటించిన ఐపీవోల ద్వారా వాటి వాటాలను ఎల్ఐసీ కొనుగోలు చేసేది. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక కామధేనువుగా, కల్పతరువుగా నిలిచింది. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారితో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేయడానికి ఎల్ఐసీని ప్రైవేటీకరించి ప్రభుత్వ నిధులను, ప్రజలు బీమా పాలసీలు కొనుగోలు చేయడం ద్వారా పొదుపు చేసిన సొమ్మును బహిరంగ మార్కెట్‌లోకి పంపేందుకు కూడా కేంద్రం వెనుకాడటం లేదు.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల స్థితిగతులను సమీక్షించడానికి 2014లో ఆర్బీఐ నియమించిన పీజే నాయక్ కమిటీ.. దారుణంగా ఉన్న బ్యాంకులను మెరుగు పరిచేందుకు వాటి ప్రైవేటీకరణ లేద పూర్తిగా బ్యాంక్ గవర్నెన్స్ ప్రక్షాళన మాత్రమే మార్గం అని సూచించింది. క్రమంగా బ్యాంకుల కార్యకలాపాల్లో ప్రభుత్వ పాత్ర కుదించుకుని, నిపుణులతో బ్యాంకుల బోర్డులు పునర్వ్యవస్థీకరించాలని పేర్కొంది.
మరోవైపు బ్యాంకుల పనితీరును మెరుగు పరిచేందుకు ముగ్గురు సీనియర్ బ్యాంకర్లతో ఏర్పాటైన బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ)ని తర్వాత ప్రభుత్వ, ఆర్బీఐ ప్రతినిధులతో విస్తరించారు. వివిధ బ్యాంకుల్లో సీనియర్ బోర్డు సభ్యుల నియామకంతోపాటు ఖాళీలను భర్తీ చేసి, ప్లానింగ్ అపాయింట్‌మెంట్స్‌లో చేయూతనివ్వాలన్న సూచన ఇప్పటికైతే బీబీబీ సకాలంలో అమలు చేసిన దాఖలాలు లేవన్న విమర్శలు ఉన్నాయి.
ప్రధానిగా ఇందిరాగాంధీ తన హయాంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న బ్యాంకులను జాతీయకరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఆందోళనలు ఉధ్రుతంగా సాగడంతో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.