ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ధేశించినట్టు తెలిపారు. గ్రామీణ మౌలిక నిధికి కేటాయింపులను రూ.40,000 కోట్లకు పెంచామని చెప్పారు.
ఇక గత ఏడాది గోధుమల కనీస మద్దతు ధర కోసం రూ. 75,000 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. దీంతో 43 లక్షల మందికి పైగా గోధుమలు పండించే రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు.
మరోవైపు, భారతీయ రైల్వేస్‌కు రికార్డు స్థాయిలో ఈ ఏడాది బడ్జెట్‌ను కేటాయించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని లోక్‌సభలో ప్రకటించారు. 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో రైల్వేస్ కోసం రూ.1,10,055 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు.
ఆ మొత్తంలో మూల ధన వ్యయం కోసం రూ.1,07,100 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2030 కోసం భారతీయ రైల్వే శాఖ జాతీయ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. లాజిస్టిక్ వ్యయాన్ని తగ్గించేందుకు ఆ ప్రణాళిక దోహదపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా మెట్రో సేవల విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.
మెట్రో లైట్, మెట్రో నియోలను అమలు చేయనున్నట్లు తెలిపారు. శుద్ధ ఇంధనం కోసం హైడ్రోజన్ ఎనర్జీ మిషన్‌ను మొదలుపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 18 వేల కోట్లతో పబ్లిక్ బస్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ స్కీమ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు మంత్రి చెప్పారు.