కరోనా వైరస్ ప్రధానంగా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపెడుతోంది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుండడంతో చాలా మంది చనిపోతున్నారు. కానీ..ఆక్సిజన్ లెవల్స్ పడిపోకుండా..తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని..ఇందుకు ప్రోనింగ్ విధానం బెస్ట్ అని ఆరోగ్య శాఖాధికారులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం అవలంబించిన..ఓ 82 ఏళ్ల వృద్ధురాలు..కరోనా వైరస్‌పై విజయం సాధించింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్‌కు చెందిన 82 ఏండ్ల వృద్ధురాలికి వైరస్ సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్, బీపీ కూడా ఈమెలో అధికంగా ఉంది.
అయితే..అకస్మాత్తుగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. వైద్యులు, కుమారుల సూచనల మేరకు ప్రోనింగ్ విధానం చేపట్టారు. ఇలా చేయడం వల్ల..ఆమెలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగి.. 12 రోజుల్లో కరోనాను జయించారు.
ప్రోనింగ్ చేయడంతో పాటు.. ఆమె ఉంటున్న గదిలో లవంగాలు, కర్పూరం ఉంచి గాలిని పీల్చేలా ఏర్పాట్లు చేశారు. నాలుగు రోజుల్లోనే..79 నుంచి 97కు ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయి. మొత్తంగా..కరోనాను జయించడంతో..కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు సీట్లు తినిపించారు.
ఇంట్లోనే ఉండి ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని, ఇళ్లలోనే ప్రోనింగ్ చేయడం మంచిది అని యూనియన్ హెల్త్ మినిస్టరీ వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఓ డ్యాక్యుమెంట్ ను పోస్టు చేసింది. ఆక్సిజన్ లెవల్స్ సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవడం మంచిదని తెలిపింది. పోస్టులో పలు చిత్రాలు కూడా పొందుపరిచారు.