సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సిందేనని, దీనికితోడు టాలెంట్ ఉండాలని మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డారు. అంటే కష్టపడే మనస్తత్వం లేనివారికి సినీ ఇండస్ట్రీలో చోటు ఉండదన్నారు. ఎంతటి స్టార్ కుమారుడైనా నచ్చకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తారని ఈ మెగా ప్రదర్ స్పష్టం చేశారు.
సినీ ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి) పెరిగిపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ కారణంగానే గొప్ప టాలెంట్ ఉన్న అనేక మంది యువ నటీనటులు ఆత్మహత్య చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, కొన్ని ఫ్యామిలీలు టాలెంట్ ఉన్న వర్ధమాన నటీనటులు పైకి రానివ్వకుండా అణగదొక్కేస్తున్నాయనే ఆరోపణలు వున్నాయి.
వీటిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తనకు తెలిసి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నెపోటిజం లేదన్నారు. తమ కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ ఎంతో కష్టపడి పైకి వచ్చారని గుర్తుచేశారు. రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయితేజ్, నిహారిక సినీ పరిశ్రమలో ఎదగడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. వీరంతా తమ కెరీర్ కోసం ఎంతో శ్రమిస్తారని తెలిపారు.
అలాగే, సీనియర్ ఎన్టీఆర్ తనయుడు కావడం వల్లే బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు కొడుకు కాబట్టే నాగార్జున అగ్రనటులయ్యారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వీరంతా తమ టాలెంట్‌తోనే గొప్ప నటులయ్యారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
ఇకపోతే, జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడో తాను స్వయంగా చూశానని అన్నారు. 'అరవింద సమేత వీరరాఘవ' చిత్ర షూటింగులో 44 డిగ్రీల ఎండలో ఒంటిపై చొక్కా లేకుండా తారక్ ఫైట్ చేయడాన్ని తాను కళ్లారా చూశానని చెప్పారు.
అలాగే, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు ప్రిన్స్ మహేష్ బాబు బొద్దుగా లావుగా ఉండేవాడనీ, కానీ, సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్కులో రోజు రన్నింగ్ చేసేవాడని నాగబాబు తెలిపారు. అందరూ చూస్తుండగానే స్లిమ్‌గా, హ్యాండ్సమ్‌గా మహేశ్ తయారైపోయాడని కితాబునిచ్చారు.