పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా `మల్లేశం`. అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరలను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత మల్లేశం సొంతం.
ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా `మల్లేశం` సినిమా తెరకెక్కింది. రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు. ఇందులో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్లేశం మంచి సినిమాగా ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఈ సినిమా గురించి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ... నేను మల్లేశం సినిమా చూసాను. ఈమధ్య కాలంలో నవ్వుకోవడం.. కళ్లంట నీళ్లు రావడం.. చిన్న రియలిస్టిక్ ఫీల్ రావడం.. ఇవన్నీ ఉన్న ఏకైక సినిమా మల్లేశం. బయోపిక్స్ చాలా చూసాం మనం. బయోపిక్ అనగానే కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. కానీ.. ఈ బయోపిక్ ఆసు మిషన్ కనిపెట్టిన మల్లేశం బయోపిక్. ఆయన చిన్నప్పటి నుంచి లాస్ట్ వరకు ఎక్కడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా... డైరెక్టర్ రాజు గారు చాలా బాగా హ్యాండిల్ చేసారు.
అలాగే అశోక్ గారు చాలా చక్కగా సంభాషణలు రాసారు. వీళ్లందరి కష్టం సినిమాలో కనిపించింది. రెగ్యులర్ కమెడియన్‌గా ఉంటూ కూడా మంచి క్యారెక్టర్ ఎంచుకున్న ప్రియదర్శికి, ఝాన్సీ గారికి టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఇలాంటి సినిమాలు తీయడానికి డబ్బు ఒకటి ఉంటే సరిపోదండి. మంచి సంకల్పం కూడా ఉండాలి. యు.ఎస్‌లో ఆల్రెడీ మంచి కంఫర్ట్‌బుల్ లైఫ్ గడుపుతున్న రాజు గారు కేవలం డబ్బు సంపాదిద్దాం అనే ఉద్దేశ్యంతో కాకుండా మరుగున పడిపోయిన మల్లేశం కథను ప్రజల ముందుకు తీసుకురావడానికి చేసిన ఈ ప్రయత్నానికి నిజంగా హ్యాట్సాఫ్.
ఈ చిత్ర నిర్మాతల టేస్ట్ ఏంటి అనేది ఈ ఒక్క సినిమాతోనే తెలిసిపోయింది. వీళ్లకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం. జనాల కష్టాలు చూడలేక భగీరథుడు నీటిని తీసుకువచ్చాడని పుస్తకాల్లో చదివి ఉంటాం. నిజంగా మల్లేశం చూసిన తర్వాత ఆసు యంత్రాన్ని ఆడవాళ్లకి ఇచ్చిన అపర భగీరథుడు అనిపించాడు. ఈ సినిమా చూడకపోతే ఆ క్యారెక్టర్ గురించి తెలిసేది కాదు.
ఫెంటాస్టిక్ ఎమోషన్స్, పెంటాస్టిక్ మూవీ. ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి కానీ..రావు. ఎప్పుడూ సినిమా చూడనివాళ్లు కూడా దయచేసి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మా పేరెంట్స్‌తో సినిమా చూడాలి అనుకున్నాను. సినిమాలో ఎంత ఎమోషన్ ఉందో... అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మల్లేశం ఈజ్ వెరీ వెరీ వెరీ గుడ్ మూవీ. ఈ సినిమాని హిట్టు సినిమా సూపర్ హిట్టు సినిమా చేయాల్సిన బాధ్యత మనది అన్నారు.