తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది.
గురువారం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగిపోయాయి. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి.
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలంగాణవ్యాపత్గా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనానికి అనుభందంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి మీ ఎత్తు వరకు కొనసాగుతోంది.
దీని ప్రభావంతో వచ్చే 48 గంటల పాటు తెలంగాణలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అలాగే, నిర్మల్ జిల్లాలో వానలు విపరీతంగా పడుతున్నాయి. దీంతో జిల్లాలో వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కడెం మండలం దత్తోజీపేట సమీపంలోని వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నిర్మల్‌లో ఇళ్లు నీటమునిగాయి. కొన్ని గ్రామాల వారు పట్టణాలకు వెళ్లేందుకు నానా యాతనా పడాల్సి వస్తోంది. ఇప్పటికే కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.