అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాష్ట్రంలోని మహిళకు శుభాకాంక్షలు తెలుపుతూ వారికి బహుమతిని కూడా ప్రకటించారు. ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులను ఆయన శనివారం ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మహిళా సంఘాల అద్దె బస్సులకు జెండా ఊపి ప్రారంభిస్తారు.
అలాగే, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో తీసుకొచ్చిన ఇందిరా మహిళా శక్తి మిషన్‌ను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. డ్వాక్రా సంఘాల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఇక ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులను ఆయన ప్రారంభించనున్నారు. అటు మహిళలే నిర్వహించేలా 312 జిల్లాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించేందుకు ఆయిల్ కంపెనీలతో శనివారం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను సీఎం రేవంత్ అందజేస్తారు. 400 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.40 కోట్ల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేస్తారు.