తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల కోసమే పని చేస్తుందని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితి కాదనీ, ఇది సమాజ బాధ్యత అని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పని చేస్తుందని మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిందని గుర్తుచేశఆరు. తాజగా 2025-26 వార్షిక బడ్జెట్‌లోనూ మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ.4,332 కోట్లు కేటాయించడం ద్వారా మహిళల సంక్షేమానికి కట్టుబడివున్నామని తెలిపారు.
అలాగే, దీపం-2 పథకం కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ కేంద్రాల బలోపేతం వంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. మహిళాభివృద్ధితోనే సమాజాభివృద్ధి అని బలంగా నమ్మి పని చేస్తున్నామని, మహిళా భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడివున్నట్టు ఆయన తెలిపారు.