Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్స్

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (13:46 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. అయితే, ఈ ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదనే సంకేతాలు వెలువడుతున్నాయి. వీటిని నిజం చేసేలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, అన్ని జాతీయ చానెల్స్‌ వెల్లడించిన ఫలితాల్లో తెరాసకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని స్పష్టంచేశాయి. 
 
కానీ, సర్వే ఫలితాలు వెల్లడించడంలో మంచి విశ్వసనీయతను కలిగిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా కూటమికి మెజార్టీ వస్తుందని తేల్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తుది ఫలితాలపై గందరగోళంతో పాటు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
మరోవైపు, అన్ని రాజకీయ పార్టీలు మాత్రం పూర్తి మెజార్టీ తమకే వస్తుందని, ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రజాకూటమి కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్‌ను బరిలోకి దించింది. 
 
తెలంగాణ ఓటరు ఇచ్చిన తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, డీకే శివకుమార్‌లు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో హంగ్ వస్తే ఏం చేయాలన్న దానిపై వీరంతా దృష్టిసారించారు. కర్ణాటక రాష్ట్రంలో ఎదురైన పరిస్థితి ఇక్కడ రాకూడదని ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. 
 
ముఖ్యంగా, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారు ఏర్పాటులో అత్యంత కీలక భూమిక పోషించిన ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో పాటు గులాం నబీ ఆజాద్‌లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. 
 
మంగళవారం వెల్లడయ్యే ఫలితాల్లో ఓటరు తీర్పు తమకు అనుకూలంగా లేనిపక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా వీరు మంతనాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు రెబెల్ సభ్యులను ప్రజా కూటమి వైపు తిప్పుకోవడమే కాకుండా, వారికి భారీ మొత్తంలో నజరానా, మంత్రిపదవులు ఇవ్వజూపాలని భావిస్తున్నారు. 
 
అంతేకాకుండా, మేజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో ఆగిపోయిన పక్షంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న అంశాన్ని కూడా వారంతా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా, ఎంఐఎంతో సంప్రదింపులు జరిపే అవకాశాలు లేకపోలేదు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

తర్వాతి కథనం