తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వంద సీట్లు కాదు కదా మహా అయితే పది సీట్లు వస్తే మహా గొప్ప అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల వాతావరణం నెలకొందన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోను తొలుత తప్పుబట్టిన తెరాస నేతలు.. అది ప్రజల్లోకి వెళ్లడం చూసి కొద్దిపాటి మార్పులతో తెరాస మేనిఫెస్టోను విడుదల చేశారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని తెలిపారు. అందుకే ఎన్నికల ప్రచారంలో 30 నుంచి 40 మంది ఆ పార్టీ అభ్యర్థులను ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు.
ఇకపోతే, ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేసమయంలో మాజీ మంత్రి కేటీఆర్ తెరాసకు 100 సీట్లు వస్తాయని చెప్పడం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవంగా ఆ పార్టీకి 100 కాదు 10 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు.