మహిళా రిపోర్టర్ చెంప నిమిరిన గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్?
తమిళనాట తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. పరీక్షల్లో మంచి మార్కులతోపాటు బంగారు భవిష్యత్తు కోరుకుంటే.. 'తాతను సుఖపెట్టా'లంటూ ఓ మహిళా ప్రొఫెసర్ విద్యార్థినిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.
తమిళనాట తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. పరీక్షల్లో మంచి మార్కులతోపాటు బంగారు భవిష్యత్తు కోరుకుంటే.. 'తాతను సుఖపెట్టా'లంటూ ఓ మహిళా ప్రొఫెసర్ విద్యార్థినిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇపుడు తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. ఈ వివాదం ఏకంగా రాజ్‌భవన్‌ను తాకింది. మహిళా ప్రొఫెసర్.. తన వ్యాఖ్యల్లో.. 'తాతను తృప్తిపరిస్తే' అని పేర్కొనడంతో ఇప్పుడు అందరి చూపూ రాజ్‌భవన్‌పై పడింది.
దీంతో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ రాజీనామాకు డిమాండ్లు మొదలవుతున్నాయి. దీంతో ఉలిక్కిపడిన గవర్నర్ మంగళవారం మీడియా సమావేశం పెట్టి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం మరింత సంచలనానికి దారితీసింది. తాను రాజీనామా చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. విరుదునగర్ జిల్లా అరుప్పుకోటలోని దేవాంకుర్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యభిచారం చేయాలంటూ విద్యార్థినులను ఒత్తిడి చేస్తున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఆమె స్వరంతో ఉన్న ఆడియోలో... తాతను సుఖపెడితే డిగ్రీలతో పాటు మంచి భవిష్యత్ ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిమరీ వివరణ ఇచ్చుకున్నారు. తాత అంటే తాను కాదనీ, 84 యేళ్ల వయసులో ఉన్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దంటూ ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే, మీడియా సమావేశం ముగిశాక గవర్నర్ లక్ష్మీసుబ్రమణ్యన్ అనే ఓ మహిళా రిపోర్టర్ చెంప నిమిరారంటూ ఓ తమిళ చానల్ బ్రేకింగ్ న్యూస్ ప్రచారం చేసింది. సమావేశంలో చివరి ప్రశ్న అడిగిన ఆ రిపోర్టర్‌ను వెళ్తూ వెళ్తూ చెంపపై తట్టారని పేర్కొంది. గవర్నర్ స్పర్శ తనకు అసహ్యం కలిగించిందని, ఆయన తాకిన చోట మూడుమార్లు సబ్బుతో కడిగిందంటూ ఆ రిపోర్టర్ అభిప్రాయాన్ని కూడా ప్రసారం చేసింది. ఇది మరింతగా కలకలం రేపింది.