తమిళనాడు రాష్ట్రంలో బోరు బావిలో పడిన రెండేళ్ళ బాలుడు ప్రాణాలు విడిచాడు. అతన్ని ప్రాణాలతో రక్షించేందుకు చేపట్టిన అన్ని రకాల సహాయక చర్యలు, సజీవంగా వెలికి తీయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. బాలుడిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. లోపలి నుంచి దుర్వాసన వస్తుండడంతో సుజిత్ చనిపోయాడని నిర్ధారించి సహాయక చర్యలు నిలిపివేశారు.
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టికి చెందిన సుజిత్ విల్సన్ అనే రెండేళ్ళ బాలుడు ఈ నెల 25వ తేదీన ఆడుకుంటూ 600 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన విషయం తెల్సిందే. ఆ బాలుడిని రక్షించేందుకు నాలుగు రోజుల పాటు ముమ్మరంగా వివిధ రకాల సహాయక చర్చలు చేపట్టారు.
ముఖ్యంగా, ఆ బాలుడు వంద అడుగుల లోతులో చిక్కుకుపోయినట్టు గుర్తించిన అధికారులు రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. అయితే, బండరాళ్ల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. బాబుకు ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు.
మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా సోమవారం బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో చిన్నారి మృతి చెందినట్టు నిర్ధారించి సహాయక చర్యలు నిలిపివేశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.