దేశవ్యాప్తంగా దీపావళి పండుగను అట్టహాసంగా జరుపుకున్నారు. అయితే తమిళనాడులో దీపావళి పండుగను అట్టహాసంగా జరుపుకుంటూనే.. ప్రజలు సుర్జీత్ అనే బాలుడి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. కారణం.. సుర్జీత్ అనే రెండేళ్ల బాలుడు బోరు బావిలో చిక్కుకుపోయాడు. 40 అడుగుల మేర లోతు వున్న బోరు బావిలో చిన్నారి పడిపోయాడు. #SujithWilson అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఆ బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు ఆ చిన్నారి బోరు బావిలోనే వున్నాడు. దీంతో తమిళనాడు ప్రజలు ఆ బాలుడు సురక్షితంగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... రెండేళ్ల సుర్జీత్ విల్సన్ అనే బాలుడు.. తిరుచ్చి, నడుకాట్టుపట్టి గ్రామానికి చెందిన వాడు.
ఈ బాలుడు అక్టోబర్ 25వ తేదీన బోరు బావిలో పడిపోయాడు. ఆ బాలుడిని రక్షించేందుకు అధికారులు తీవ్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రెవెన్యూ అధికారి డాక్టర్ జె. రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నమ్మకానికి తగిన తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం కుదరదని చెప్పారు.
సహాయక చర్యల్లో చాలామంది వాలంటీర్లు వున్నారని.. పంజాబ్ నుంచి టీమ్‌ను రప్పించినట్లు చెప్పారు. జర్మన్ మెషీన్లను ఉపయోగించి సహాయక చర్యలు చేస్తున్నట్లు తెలిపారు. బలూన్ల సాయంతో లోతును తెలుసుకుంటున్నామని, బాలుడి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేస్తున్నామని, కానీ నమ్మకం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ఇవ్వలేమని చెప్పారు. ఇప్పటికే ఒక వైపు 98 అడుగుల లోతు తవ్వి ఎయిర్ లాక్ చేశామని.. మరోవైపు 40 అడుగుల లోతు తవ్వేశామని వెల్లడించారు.