తనకు ఢిల్లీ నుంచి సందేశం రావడమే తరువాయి... తన పదవికి రాజీనామా చేస్తానని కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు. తన రాజీనామా గురించి వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను తాను పాటిస్తానని స్పష్టం చేశారు.
అధిష్టానం నుంచి సందేశం వస్తుందేమోనని ఆదివారం సాయంత్రం వరకు ఎదురుచూశానని, కానీ అలాంటిదేమీ రాలేదని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానా లేదా అనే దానిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముందన్నారు.
అధికారంలో ఉన్నా లేకపోయినా మరో 10-15 ఏళ్లపాటు పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. బెళగావిలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి ఆదివారం వచ్చిన ఆయన ఈ మేరకు విలేకర్లతో మాట్లాడారు.
మరోవైపు, కర్ణాటకలో నాయకత్వ సంక్షోభంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. యడియూరప్ప రాజీనామా చేయబోతున్నారంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నవేళ ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కర్నాటకలో నాయకత్వ సంక్షోభమేమీ లేదన్నారు.
ముఖ్యమంత్రి యడియూరప్ప తనదైనశైలిలో బాగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు. గోవాలో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న నడ్డా ఆదివారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. గోవాలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ప్రమోద్ సావంత్ నేతృత్వంలోనే భాజపా బరిలో దిగుతుందని నడ్డా ప్రకటించారు.