కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో హిజ్రాలు (ట్రాన్స్‌జెండర్స్)కు ఒక శాతం రిజర్వేషన్ కోటాను కల్పించింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కింది.
రిజర్వు కానిస్టేబుల్, బ్యాండ్స్‌మెన్ ఉద్యోగ నియామకాల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించకపోవడంపై సంగమ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌పై కర్ణాటక హైకోర్టులో వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రభుత్వ వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్ల విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒకశాతం రిజర్వేషన్ కల్పించినట్టు చెప్పారు.
దీనిపై స్పందించిన కోర్టు ట్రాన్స్‌జెండర్ల కోటా విషయంలో ఎలాంటి నిబంధనలు అమలు చేయబోతోందో రెండు వారాల్లోగా చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.