పదిహేనవ ఆర్థిక సంఘం తన నివేదికను నవంబరు 9వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుందని తెలిపింది.
కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ నివేదికపై కూలంకషంగా చర్చించారు. నివేదికకు తుదిమెరుగులు దిద్దారు. నివేదికపై ఎన్‌కే సింగ్, సభ్యులు అజరు నారాయణ్ ఝా, అనూప్ సింగ్, అశోక్ లహిరి, రమేష్ చంద్ సంతకం చేశారు.
రాష్ట్రపతికి తమ నివేదిక సమర్పించడానికి కమిషన్ సమయం కోరిందని, అన్ని అంశాలపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత నివేదికను నవంబరు 9వ తేదీన సమర్పిస్తామని రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు ఆ ప్రకటన తెలిపింది.
కమిషన్ తన నివేదిక కాపీని ప్రధాని నరేంద్రమోడీకి కూడా సమర్పిస్తుందని వివరించింది. ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సిఫార్సులు నివేదికలో ఉంటాయి. ఈ నివేదికను కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంటుకు సమర్పిస్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలతో వివిధ స్థాయిల్లో కమిషన్ సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపి నివేదికను ఖరారు చేశారు.