Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా నుంచి ఎలా కోలుకున్నానో తెలుసా?: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Advertiesment
కరోనా నుంచి ఎలా కోలుకున్నానో తెలుసా?: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
, గురువారం, 15 అక్టోబరు 2020 (07:56 IST)
ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన అనుభవాన్ని వెల్లడించారు. ఇది కరోనా బాధితులకు ఉపయుక్తంగా వుంటుందన్న కారణంగా ఆయన ఆ అనుభవాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

అక్టోబర్ 12న ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షల్లో నెగటీవ్ ఫలితం రావడం, కోవిడ్ నుంచి కోలుకోవడం సంతోషకరం. సెప్టెంబర్ 29న నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన నాటి నుంచి నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ వైరస్ ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు పాటించాను. 
 
ఈ సందర్భంలో మొదటగా గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, శాసన సభ్యులు, విభిన్న పార్టీలకు రాజకీయ నాయకులతో పాటు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ మతాలు, ప్రాంతాలకు అతీతంగా నేను కోవిడ్ సంక్రమణ నుంచి త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 
 
నా శ్రీమతి ఉషమ్మ కరోనా వైరస్ వల్ల ప్రభావితం కాలేదు. ఆమె శారీరకంగా, మానసికంగా బలమైన వ్యక్తి. అదే విధంగా గతంలో కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయిన నా వ్యక్తిగత సిబ్బంది సహా 13 మంది ఉపరాష్ట్రపతి సచివాలయ ఉద్యోగులు కూడా పూర్తిగా కోలుకున్నారని తెలిసి ఎంతో సంతోషించాను.
 
అలాగే, రాజ్యసభ సచివాలయానికి చెందిన 136 మంది కోవిడ్ బాధిత ఉద్యోగులు కోలుకోవడం ఆనందదాయకం. వారిలో 127 మంది విధులకు హాజరౌతుండగా, మిగిలిన వారు ఇళ్ళ నుంచే పని చేస్తున్నారు. 
 
నా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించే బాధ్యతలు నిర్వర్తించిన వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి, అదే విధంగా ఎప్పటికప్పుడు తమ సూచనలు, సలహాలు అందించిన ఎయిమ్స్, మరియు ఇతర వైద్య నిపుణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పని పట్ల వారి నిబద్ధత, సేవాదృక్పథం మరచిపోలేనివి.
 
ఉపరాష్ట్రపతి నివాసంలో నాకు తోడుగా, అన్ని వేళలా నాకు సేవలు అందించిన నా వ్యక్తిగత సిబ్బంది విక్రాంత్,  చైతన్యలను కూడా అభినందిస్తున్నాను. నిజానికి వారు వైద్యులు సూచించిన పూర్తి జాగ్రత్తలు పాటిస్తూనే, నాకు అందించిన సేవలను నేను ఎప్పటికీ మరచిపోలేను. స్వీయనిర్బంధంలో నేను మిత్రులు, సన్నిహితులు, బంధువులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నాను.
 
నా వయసుతో పాటు మధుమేహం లాంటి కొన్ని వైద్య సమస్యలు ఉన్నప్పటికీ శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, నడక, యోగ వంటి సాధారణ శారీరక వ్యాయామంతో పాటు దేశీయ (సంప్రదాయ) ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల నేను కోవిడ్ సంక్రమణ నుంచి కోలుకోగలిగానని బలంగా విశ్వసిస్తున్నాను. నేను ఎప్పుడు సంప్రదాయ ఆహారాన్ని తినేందుకే ఆసక్తి చూపుతాను. స్వీయ నిర్బంధ కాలంలో కూడా అదే కొనసాగించాను. 
 
నా స్వీయ అనుభవం, దృఢమైన నమ్మకం ఆధారంగా ప్రతిరోజూ కొంత సేపు నడక, జాగింగ్, యోగా లాంటి శారీక వ్యాయామాన్ని చేయాలని ప్రతి ఒక్కరికీ సూచిస్తున్నాను. అదే విధంగా పోషకాహారాన్ని తీసుకోవడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. అలాగే కోవిడ్ నుంచి రక్షణ విషయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించరాదు. 
 
అన్నివేళలా మాస్క్ లను ధరించడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత లాంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. 
 
స్వీయ నిర్బంధ సమయంలో కోవిడ్ మహమ్మారి సహా వివిధ సమస్యలపై వార్తాపత్రికలు, ఇతర మాగజైన్ లలో కథనాలను, ఆసక్తికరమైన వివిధ అంశాల మీద ప్రముఖులు రచించిన పుస్తకాలను చదవడం ద్వారా నేను సమయాన్ని చక్కగా గడపగలిగాను. 
 
స్వాతంత్ర్య ఉద్యమ విభిన్న కోణాల అధ్యయనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో, స్వరాజ్య సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల ధైర్యం, త్యాగాల గురించి వారానికి రెండు ఫేస్ బుక్ పోస్ట్ (మనోగతం)లను రాస్తూవచ్చాను. 
 
కోవిడ్ – 19 మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం సమర్థవంతమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. మాస్క్ లు ధరించడం, చేతులు సబ్బుతో కడుక్కోవడం, సురక్షిత దూర ప్రమాణాలను పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగల ప్రజల సమిష్టి సంకల్పం తక్షణావసరం.
 
వైద్యుల సూచనల మేరకు నేను అంతర్జాలం ద్వారా బహిరంగ కార్యక్రమాలకు మరికొంత కాలం హాజరు కాలేను. ఓ వారం పదిరోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని నిశ్చయించుకున్నాను.
 
విజయదశమి తర్వాత ప్రజాసంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాలని ఆలోచిస్తున్నాను. జాగ్రత్తగా ఉండటం మనందరి బాధ్యత!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్ళీ ఆంబులెన్సును నడిపిన రోజా...