డీఎంకే అధినేత స్టాలిన్‌ను సీఎం కుర్చీపై కూర్చోబెడతానని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ పేర్కొన్నారు. ప్రాణాలున్నంత వరకు స్టాలిన్‌ను తన భుజాలపై మోస్తానని చెప్పుకొచ్చారు. తిరుప్పత్తూరు పర్యటనలో భాగంగా దురైమురుగన్ మాట్లాడుతూ.. కాట్పాడి సమీపంలోని ఓ కుగ్రామంలో జన్మించిన తాను ప్రస్తుతం డీఎంకే ప్రధానకార్యదర్శిని అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు.
పార్టీలో సీనియర్ నేతను కావడంతో పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తనకు ఈ పదవి కట్టబెట్టారని అన్నారు. పార్టీ సభ్యుడిగా చేరిన తొలిరోజుల్లో కరుణానిధి ఇంటికి వెళ్లిన సమయంలో స్టాలిన్ పాఠశాల విద్యార్థిగా ఉన్నారని, అనంతరం పార్టీలో పలు పదవులు చేపట్టిన ఆయన ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగారని అన్నారు.
తనకు కుటుంబం, ఆస్తుల కన్నా పార్టీయే ముఖ్యమని, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. డీఎంకే అధికారం చేపట్టిన వెంటనే కావేరి నీటిని పాలారు నదికి తరలించేలా సమగ్ర నీటి పథకాన్ని అమలు చేయడంతో పాటు పాలారు నది ప్రాంతాల్లో 10 చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించి నీటిని నిల్వ చేసి, రైతులకు తగినంత సాగునీరు అందిస్తామని దురైమురుగన్ హామీ ఇచ్చారు.