ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కోవిడ్-19 వైరస్ కుదిపేస్తోంది. అమెరికా, బ్రెజిల్ తోపాటు మన దేశంలోనూ అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీలైనంత ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండిపోవడం వల్ల మానసిక ఒత్తిడి మరియు కుంగుబాటుకు గురవుతారు.ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఒత్తిడికిలోనైతే రోగ నిరోధకశక్తి కొద్ది కొద్దిగా నశిస్తుంది. కనుక రోగ నిరోధశశక్తిని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. మరికొన్ని చిట్కాలు పాటిస్తే కోవిడ్19 మహమ్మారి బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
ఒత్తిడికి లోనైనపుడు కనిపించే లక్షణాలు:
ఆందోళనగా కనిపించడం, ఒళ్ళంతా చెమట పట్టడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, నోరు పొడిబారినట్లు అవడం, గుండెదడ వంటి లక్షణాలతో పాటు మానసిక ఒత్తిడి, అధికంగా ఆందోళన చెందడం, ఏ పనిమీద సరిగా దృష్టి పెట్టలేకపోవడం, ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.
ఒత్తిడిని జయించేందుకు కొన్ని చిట్కాలు:
నిద్ర: కంటి నిండా నిద్ర ఉంటే ఆ వ్యక్తులకు ఒత్తిడిని సులువగా జయిస్తారని చెప్పవచ్చు. రాత్రిపూట త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తే మానసిక ప్రశాంతత దొరుకుంది.
సమయానికి ఆహారం తీసుకోవడం:
ఆహారాన్ని సమయానికి తీసుకుంటే పనిపట్ల శ్రద్ధ పెరుగుతుంది. మీ ఫలితాలు పాజిటివ్‌గా ఉంటాయి. ఆరోగ్యకర, రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. చక్కెర, కార్బొహైడ్రేట్లను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.
మద్యానికి దూరంగా ఉండడం:
చెడు అలవాటు అని తెలిసినా మద్యాన్ని మానేయలేరు. కానీ మద్యం సేవించిన తర్వాత కోపం పెరిగి ఇతరులతో గొడవ పడటం, కోపాన్ని ప్రదర్శించడం చేస్తారు. దీని వల్ల కొన్ని బంధాలు కోల్పోతారు. సాధ్యమైనంతవరకు మద్యం తీసుకోవడం తగ్గించడం మంచిది.
వ్యాయామం లేదా యోగా:
ప్రతిరోజూ ఉదయం యోగా లేక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శారీరకంగా ఫిట్‌గా ఉంటారు. ఏదైనా సాధిస్తాను అనే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. దీంతో మీకు ఇబ్బందులు ఎదురైనా ప్రశాంతంగా వాటికి పరిష్కారం చూసుకోగలుగుతారు.
వదంతులకు దూరంగా ఉండడం:
మీ చుట్టు అది జరిగింది, వాళ్లు ఇలా, వీళ్లు ఇలా చేశారంటూ పొరుగువారు మీతో డిస్కషన్ కు వస్తే అక్కడే ఆపేయండి. వీటి బదులు మీరు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మీ పనులు సులువుగా పూర్తిచేసే అవకాశాలుంటాయి.
మరికొన్ని మార్గాలు:
* మానసిక ఒత్తిడికి గురైనపుడు మనకు లభించిన సమయాన్ని సరైన కార్యక్రమాలు ఎంచుకోవడంతో పాటు సానుకూల దృక్పథం గల ఆలోచనలు చేస్తూ సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలి.
* టివిలలో మానసిక ఉల్లాసం కలిగించేటువంటి కార్యక్రమాలు చూడడం మంచిది. భయాందోళనకు గురిచేసే సినిమాలు, ప్రోగ్రామ్స్ చూడవద్దు.
* ఆహ్లాదానిచ్చే సినిమాలు చూడడం, ఇంట్లోనే ఉంటూ బంధువులు మరియు స్నేహితులతో మాట్లాడడం, పజిల్స్ సాధించడం, స్టోరీబుక్స్ చదవుతూ ఉండాలి.
మానసిక కుంగుబాటుకు గురయినపుడు:
* మనిషి మానసికంగా కుంగుబాటుకు గురైనపుడు దాన్ని అధిగమించడంతోపాటు మనోబలంతో ఉండేందుకు ప్రయత్నించాలి.
* వ్యాయామాలు చేయడం, ఇంట్లో వారికి పనుల్లో సాయం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడం, కుటుంబసభ్యులతో కలసి ఉండడం చేస్తూ ఉండాలి.
* మరీ ఎక్కువ ఒత్తిడికి గురైనపుడు గదిలో ఒంటరిగా ఉండకూడదు. అలాగే ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు సొంత వైద్యం చేసుకుని ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉన్న సరైన వైద్యున్ని సంప్రదించి తగిన సహాయం పొందాలి.
కోవిడ్ పై పోరాటంలో ప్రజలు మనోబలంతో ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వం తీసుకునే కొన్ని కఠిన చర్యల వల్ల ప్రజలు కొంత ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే పైన చెప్పిన సూచనలు పాటించడం ద్వారా ప్రజలు మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు గురవకుండా ఉండవచ్చు.