జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అవంతిపోరలో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరికొందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అవంతిపోరా జిల్లాలోని రాజ్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది.
దీంతో భద్రతా బలగాలు, పోలీసుల సంయుక్త బృందం అక్కడికి చేరుకొని.. ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే సెర్చ్ పార్టీ అనుమానస్పదంగా కనిపించిన ప్రదేశం వైపు వెళ్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం వారికి ధీటుగా బదులిచ్చింది.
బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఓ పోలీస్ అధికారి తెలిపారు. కాల్పుల్లో మృతి చెందిన వారిని త్రాల్‌కు చెందిన షాహిద్ రాథర్, షోపియాన్‌కు చెందిన ఉమర్ యూసుఫ్‌గా గుర్తించినట్లు ఐజీ విజయ్‌కుమార్ మంగళవారం తెలిపారు.
ఇద్దరు పలు నేరాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇదిలావుండగా.. గడిచిన 24 గంటల్లో కాశ్మీర్‌లో కాల్పులు జరుగడం ఇది రెండోసారి. సోమవారం వేకువజామున సైతం పుల్వామాలో ఇద్దరు జైషే ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెల్సిందే.