ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలు కొన్ని నిమిషాల పాటు స్తంభించిపోయాయి. గూగుల్ ఐపీని హైజాకింగ్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఐపీ హైజాకింగ్‌కు గురైనట్టు ఓ భారతీయుడు గుర్తించాడు.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.12 నుంచి 2.35 గంటల వరకు గూగుల్ సెర్చింజన్, అనలటిక్స్, మరికొన్ని క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలు పనిచేయలేదు. నైజీరియాకు చెందిన మెయిన్‌వన్ అనే ఒక చిన్న టెలికాం సంస్థకు చెందిన ఐపీ అడ్రస్ నుంచి గూగూల్‌కు చెందిన బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (బీజీపీ)పై దాడి చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయాన్ని థౌజండ్ ఐస్ అనే సంస్థకు చెందిన భారతీయుడు అమిత్ నాయక్ తొలుత గుర్తించాడు. ఈ హైజాకింగ్ దాడిని గూగుల్ కూడా నిర్ధారించింది. అయితే, దాడికి గల కారణాలను మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ఐపీ హైజాకింగ్ కారణంగా అమెరికా, రష్యా, చైనా, నైజీరియాల్లో గూగుల్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.