చైనాలోని అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాల్లో ఒకటి మంగళవారం వణుకుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ సంఘటన షెంజెన్ నగరంలో జరిగింది.
చైనాలోని సామాజిక మాధ్యమ వేదిక 'వీబో'లో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షెంజెన్‌లోని ఫుటియాన్ జిల్లాలో ఎస్ఈజీ ప్లాజా హఠాత్తుగా వణికింది. దీనికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
భూకంపాల పర్యవేక్షక స్టేషన్ల నుంచి సమాచారాన్ని తెప్పించుకుని విశ్లేషించినట్లు తెలిపారు. షెంజెన్ నగరంలో మంగళవారం భూకంపం సంభవించలేదని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు.
షెంజెన్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎస్ఈజీ ప్లాజా అకస్మాత్తుగా కదిలింది. ఇది 300 మీటర్లు (980 అడుగులు) ఎత్తయిన ఆకాశహర్మ్యం.
ఇది హఠాత్తుగా వణకడం ప్రారంభమవడంతో దీనిలోని ప్రజలను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల సంచరిస్తున్న ప్రజలు భయాందోళనతో సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు.