అద్దాల వంతెన నడుస్తూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అద్దాలు ఊడిపోవడంతో చైనాకు చెందిన వ్యక్తి 330 అడుగుల ఎత్తులో వేలాడాడు. చైనాలోని లాంగ్జింగ్‌లోని పియాన్ మౌంటెయిన్ కల్చరల్ టూరిజం సీనిక్ ఏరియా దగ్గరున్న అద్దాల వంతెన వద్ద శుక్రవారం జరిగిందీ ఘటన. ఓ టూరిస్ట్ అద్దాల వంతెనపై నడుస్తుండగా.. అకస్మాత్తుగా గాలి వీచింది. కొద్ది సేపట్లోనే గాలి వేగం 150 కిలోమీటర్లకు పెరిగింది.
ఆ ఈదురుగాలుల ధాటికి వంతెన అద్దాలన్నీ ఊడిపోయాయి. కంగారుపడిపోకుండా ఆ వ్యక్తి వెంటనే సమయస్ఫూర్తితో పక్కలకు పెట్టిన ఇనుప కడ్డీలను పట్టుకున్నాడు. కింద ఏ ఆధారమూ లేకపోవడంతో చాలా సేపు దానిని పట్టుకుని అలాగే వేలాడాడు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అతడిని కాపాడారు.