కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు తమకు తెలిసిన, తోచిన రక్షణా పద్ధతులను పాటిస్తున్నారు. ముఖ్యంగా, సామాజిక దూరం పాటించడం, ముఖాలకు మాస్కులు ధరించడం, టీకాలు వేసుకోవడం వేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు.
అయితే, కొందరు కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల ఓ ఉపాధ్యాయుడు కరోనా రాకూడదని ముక్కులో నిమ్మరసం పిండుకుని చనిపోయిన ఘటనను మరువక ముందే.. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
కరిగించిన వెండి తాగితే కరోనా సోకదనే నమ్మకంతో అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందని ఓ మహిళా ఆధ్యాత్మికవేత్త కరిగించిన వెండి తాగింది. కానీ, కరోనా రాకపోవడం సంగతి అటుంచితే ఆమె ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి.
కొలరాడోలో అమి కార్ల్‌సన్ (45) అనే మహిళ సలవ్ హాజ్ ఓన్ అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతున్నది. ఆమె శిష్యులంతా ఆమెను మదర్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు.
అయితే, కొన్ని రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు సమాచారం అందడంతో విచారణ కోసం పోలీసులు ఆమె ఇంటి వెళ్లారు. కానీ, అక్కడ కనిపించిన వింత దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆమె ఇంట్లో దాదాపు 10 మంది వరకు శిష్యులున్నారు.
కార్ల్‌సన్ మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి, బాక్సులో పెట్టి ఉంచారు. దాని చుట్టూ విద్యుత్ దీపాలు అలంకరించి భజనలు, పూజలు చేస్తున్నారు. దాంతో పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని, కార్ల్‌సన్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
పోస్టుమార్టం నివేదికలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కార్ల్‌సన్ ఈ ఏడాది మార్చిలోనే చనిపోయిందని డాక్టర్లు గుర్తించారు. ఆమె ద్రవరూపంలో ఉన్న వెండిని అధిక మొత్తంలో సేవించడం వల్ల చనిపోయినట్లుగా తెలిపారు.