Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా విషయంలో భారత్‌కు చైనా చేస్తున్న సాయం రెండు దేశాల సంబంధాలను మెరుగు పరుస్తుందా?

కరోనా విషయంలో భారత్‌కు చైనా చేస్తున్న సాయం రెండు దేశాల సంబంధాలను మెరుగు పరుస్తుందా?
, శనివారం, 8 మే 2021 (21:17 IST)
భారతదేశం కరోనా వైరస్ రెండో వేవ్‌ను ఎదుర్కోవడంలో తలమునకలై ఉంది. ఈ పరిస్థితిలో భారత్‌కు సాయం చేయడానికి చాలా ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. మరి ఈ సమయంలో చైనా ఏం చేస్తోంది? భారతీయ మీడియా దీనిపైనే దృష్టి పెట్టింది. సరిహద్దుల్లో గొడవల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా సున్నితంగా మారాయి. ఈ సమయంలో వచ్చిన కోవిడ్ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను కొంత వరకు తగ్గించగలదని చాలామంది భావిస్తున్నారు.

 
చైనా ఏం చేసింది?
కరోనా వైరస్ విషయంలో భారత్‌కు సాయం చేయడానికి చైనా ముందుకొచ్చిందని గత వారం చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా పదే పదే కథనాలు ఇచ్చింది. ఏప్రిల్ 30న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత ప్రధానికి పంపిన సందేశాన్ని ఆ వార్తా సంస్థ ఉటంకించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ కూడా ఏప్రిల్ 30న భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్‌కు ఫోన్ ద్వారా సానుభూతి సందేశాన్ని పంపారు.

 
కోవిడ్-19ను ఎదుర్కోవడంలో సాధ్యమైనంత సహాయం అందించడానికి చైనా సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 22 నుంచి 30 మధ్య వరుసగా ఏడుసార్లు మీడియా సమావేశాలలో విదేశాంగ మంత్రి భారతదేశానికి సానుభూతి తెలిపారని, సహాయం అందిస్తామని అధికారికంగా ప్రకటించారని చైనా వార్తా పత్రిక గ్లోబల్‌ టైమ్స్ పేర్కొంది. అయితే, ఇండియాకు చైనా విమాన సర్వీసులు నిలిపివేసినట్లు నటుడు సోనూ సూద్ లాంటి వారు విమర్శలు చేశారు. భారత్‌ దేశంలో చైనా రాయబారి సన్ వీడాంగ్ ఆ విమర్శలను తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని ట్వీట్ చేశారు.

 
చైనా నుంచి 5,000 వెంటిలేటర్లు, 21,569 ఆక్సిజన్ జనరేటర్లు, 21 మిలియన్లకు పైగా సర్జికల్ మాస్కులు, 3800 టన్నుల మందులను భారత్‌కు పంపామంటూ వీడాంగ్ చేసిన ట్వీట్‌ను చైనా మీడియా ప్రచురించింది. అయితే, ఈ సరకులన్నీ చైనా దానం చేయలేదు. భారత ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది.

 
చైనా మీడియా ఏం కోరుకుంటోంది?
కోవిడ్ -19 సరుకుల సరఫరాను భారత్ అంగీకరిస్తే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడంలో ఇది సహాయ పడుతుందని చైనా, హాంకాంగ్ మీడియాలు ఆశాభావంతో ఉన్నాయి. జూన్ 2020లో గాల్వన్‌ లోయలో ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరుపక్షాలు భారీ ప్రాణనష్టాన్ని చవి చూశాయి.

 
''చైనా, భారత్‌ల మధ్య సరిహద్దు ఘర్షణను మనం మరచి పోలేం. కానీ, కరోనాపై పోరులో భారత్‌కు చైనా సహకరిస్తుంది'' అని గ్లోబల్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ హు సైచిన్ సోషల్ మీడియా వీబోలో వ్యాఖ్యానించారు. ''ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడంలో కచ్చితంగా ఉపయోగపడుతుంది'' అని ఆయన అన్నారు.

 
భారత్‌ పై విమర్శలు
అదే సమయంలో భారత్ పై చైనా నుంచి విమర్శలు కూడా వినిపించాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరచడంలో భారత్‌లోని సూపర్ నేషనలిజం అడ్డుగా మారుతోంది, చైనా ప్రయత్నాలు కష్టంగా మారుతున్నాయని ఆ దేశపు సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, భారత దేశంపై విమర్శలు చేసే చైనా జాతీయులు భారత్‌లోని జాతీయవాదుల కంటే ఏ మాత్రం తక్కువ కాదని, భారతదేశంపై ఇక్కడి నుంచి విమర్శలు వినిపించడం సహజమేనని మే 4న వీబోలో రాసిన సంపాదకీయంలో హు సైచిన్ వ్యాఖ్యానించారు.

 
''అధికారిక స్థాయిలో చైనా తన వైఖరేంటో భారత్‌కు చెబుతూనే ఉంది. అదే సమయంలో సమాజంలో విభిన్న స్వరాలు చైనాలో అభిప్రాయాల మధ్య వైరుధ్యాన్ని చూపుతాయి'' అన్నారాయన. కోవిడ్-19 కోసం చైనా ఆసుపత్రి నిర్మిస్తున్న దృశ్యాలు, భారతదేశంలో మృతుల అంత్యక్రియలను చైనా అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ ఏజెన్సీ, ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్‌లు ప్రచురించగా, వాటిని చూపిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 30, మే 1 తేదీలలో ఈ రెండు ఫొటోలు చైనా సోషల్ మీడియాలో కనిపించాయి. తర్వాత వాటిని డిలీట్ చేశారు.

 
భారత మీడియా స్పందన ఏంటి?
ఇప్పటి వరకు భారత్ చైనా నుంచి ఎలాంటి సహాయం తీసుకోలేదని భారత మీడియా నొక్కి చెబుతోంది. ''భారతదేశం వాణిజ్య ప్రాతిపదికననే వైద్య సామాగ్రి కొనుగోలుకు చైనాను ఎంచుకుంది'' అని 'ది హిందూ' పత్రిక రాసింది. ''అత్యవసర ప్రాతిపదికన చైనా నుంచి భారత్ ఆక్సిజన్ పరికరాలను ప్రత్యేకంగా కొనుగోలు చేసింది. ఇది 16 సంవత్సరాలలో దేశ విధానాలలో పెను మార్పునకు సూచిక'' అని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రాసింది.

 
''చైనా నుంచి వైద్య పరికరాలను కొనుగోలు చేయడానికి భారత్‌కు సైద్ధాంతిక సమస్యలేవీ లేవు, ఇటీవల భారత విమానాలు హాంకాంగ్ నుంచి 800 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తీసుకొచ్చాయి'' అని 'ది హిందూ' ఏప్రిల్ 29న రాసింది. ''ఆక్సీమీటర్ల వంటి చైనా సరుకులు భారతదేశ వైద్య పరికరాలలోకి చొచ్చుకుపోయాయి. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలలో స్థిరత్వానికి సూచిక'' అని 'ది ఎకనామిక్ టైమ్స్' పత్రిక ఏప్రిల్ 26 రాసింది.

 
సరిహద్దు ఉద్రిక్తత - అమెరికా
సరిహద్దు ఉద్రిక్తతలు చైనా-ఇండియా సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయని, అమెరికా భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి అని ఇండియన్ మీడియా తెలిపింది. అయితే, కరోనా వ్యాక్సీన్ ముడి పదార్ధాన్ని భారత్‌కు అందకుండా అమెరికా నిషేధించడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలాయని ఏప్రిల్ 28న రాసిన ఓ కథనంలో 'ది హిందూ' పేర్కొంది. ఇటువంటి అంశాలు రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తాయని ఈ కథనం పేర్కొంది.

 
కరోనా వైరస్ కారణంగా, బలగాల ఉపసంహరణపై రెండు దేశాల మధ్య లద్ధాఖ్‌లో మే 1న జరగాల్సిన కమాండర్ స్థాయి చర్చలు రాబోయే కొద్ది నెలలపాటు జరగబోవని, 'ప్రింట్' న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. భారత జవాన్లు లద్ధాఖ్‌లోనే నిఘా పెట్టారని, డ్రోన్లతో చైనా కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నారని తమకు సమాచారం ఉందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.
అయితే చైనా జవాన్లు తూర్పు లద్ధాఖ్‌లోని వాస్తవాధీన రేఖకు చాలా చేరువలోనే ఉన్నారని వెల్లడించింది.

 
''భారత దేశంలో కోవిడ్ ఉధృతి పెరిగాక, తూర్పు లద్ధాఖ్‌లో చైనా సైన్యం కదలికలు పెరిగాయి. అక్కడ శాశ్వత షెడ్లు, టెంట్లను ఏర్పాటు చేసింది'' అని ఏప్రిల్ 30 న 'ఇండియా టుడే' పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌ర్ఫ్యూ ప్ర‌భావం.. త‌గ్గిన క‌రోనా కేసులు, రెండు రోజుల్లోనే 7వేలు వ‌ర‌కు త‌గ్గుద‌ల