ఒకవైపు కరోనా వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా రోగుల ప్రాణాలు రక్షించే మందులపై జీఎస్టీ వసూలు చేయడం.... శవాలపై పైసలు ఎరుకున్న చందమే అవుతుందని రాజస్థాన్ రాష్ట్ర మంత్రి ప్రతాప్ ఖచరియవస్ ఆరోపించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొవిడ్-19 వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రో ధరల పెంపుపై మోడీ సర్కార్ కరోనా కష్టకాలంలోనూ వెనక్కి తగ్గడం లేదన్నారు.
దేశంలో పౌరులందరికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచిత వ్యాక్సిన్ పొందడం పౌరుల హక్కని.. దీనిపై ఎలాంటి చర్చ లేకుండా సత్వరమే పౌరులందరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కొవిడ్ వ్యాక్సిన్లపై పన్నుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.3000 కోట్లు వెచ్చించాల్సి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు విడుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాల నిర్వహణ బాధ్యతను తన గుప్పిట్లోకి తీసుకుందని విమర్శించారు.