ఎవరికైనా 'పాపం' పండే రోజు ఒకటొస్తుంది. అవినీతి, వందల కోట్ల అక్రమార్జన, భూ దందాలు, అధికార దుర్వినియోగం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారికి తగిన 'శిక్ష' తప్పదు. కొద్దిగా ముందో.. వెనుకో.. అంతే!
దాదాపు ఏడేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, ఆయన అండదండలతో చెలరేగిపోతున్న 'వ్యక్తుల' భరతం పట్టడానికి రంగం సిద్ధమైంది. C.M.O.లో వివిధ క్యాటగిరీలలో పని చేస్తున్న ఉద్యోగుల 'అక్రమార్జన'పై కేసీఆర్ టీమ్ దృష్టి సారించింది.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల వ్యవహారాల్లో 'తల దూర్చడం', ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి పేరును వాడడం, 'ముఖ్యమంత్రి చెప్పారు' అని అధికారులు, ప్రజాప్రతినిధులకు 'ఆదేశాలు 'ఇవ్వడం, ఇష్టారాజ్యంగా పైరవీలు చేయడం, హైదరాబాద్ నుంచి దాదాపు 150, 200 కిలోమీటర్ల పరిధిలో విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, లెక్కకు మించి, వందల కోట్ల ఆస్తులు కూడబెట్టడం వంటి అనేక ఆరోపణలు CMOలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు, అధికారులపై వస్తుండడం పట్ల కేసీఆర్ గరంగరంగా ఉన్నారు.
ఇక ఎవరినీ ఉపేక్షించరాదని ఆయన భావిస్తున్నారు. కేసీఆర్ 'మూడో కన్ను' తెరచినందున అక్రమాలకు పాల్పడుతున్న వారు గజగజ వణుకుతున్నారు. CMOకు 'క్లీన్ ఇమేజ్' తీసుకురావాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ విషయమై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతో సీఎం చర్చించారు. అక్రమ ఆస్తులు కూడబెట్టిన వారి వివరాలు, జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. PRO విజయకుమార్‌కు ఉద్వాసన పలకడంతో 'ప్రక్షాళన'కు కేసీఆర్ శ్రీకారం చుట్టినట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నవి.
త్వరలోనే మరికొందరిని 'యింటికి' పంపబోతున్నారు. ఎవరి మెడపై కత్తి వేలాడుతున్నదో తెలియదు. కొందరు 'అవినీతిపరులు' తేలు కుట్టిన దొంగల'వలె CMOలో ఉన్నారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాదాపు 50 కోట్ల విలువ చేసే 'ఇసుక రీచ్'ను సొంతం చేసుకున్న CMO ఉద్యోగిపై వేటు పడవచ్చు. కొందరు 'కోవర్టుల'ను కూడా ఏరి పారేయాలని ముఖ్యమంత్రి దృఢసంకల్పంతో ఉన్నారు.
TRANSCOలో ఉన్నతస్థాయి పదవిలో ఉండి డిప్యుటేషన్ పైన CMOలో పనిచేస్తున్న ఉద్యోగి ఇటీవల 24 కోట్ల TRANSCO నిధులను కైంకర్యం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే అతను తన పరపతి, ముఖ్యమంత్రి దగ్గరున్న చనువును ఆసరా చేసుకొని కొండాపూర్ బొటానికల్ గార్డెన్ దగ్గర ఒక నిర్మాణ సంస్థతో 'మాట్లాడి' ఒక అధునాతన అపార్టుమెంటులో తన 'కులస్తులకు' 18 మందికి ఫ్లాట్స్‌ను ఇప్పించినట్టు సమాచారం అందుతుంది.
ఈ ఫ్లాట్లలో మరో ఇద్దరు, ముగ్గురు PRO(మంత్రుల దగ్గర పనిచేసే వ్యక్తులు)లు, పోలీసు శాఖలో పని చేసే సదరు 'కులం' వారు కూడా ఉన్నట్టు తెలియవచ్చింది. దీంతో కొందరు మంత్రుల PROల ఆస్తులపై కూడా CMO ఆరా తీస్తున్నది. ఒక 'మంత్రి'పై ఉన్న కోపంతోనే తనకు ఉద్వాసన చెప్పారని కొందరు సన్నిహితులకు 'వేటు పడ్డ' PRO చెబుతున్నట్టు సమాచారం అందుతున్నది.
ఏ 'మంత్రి' ఆశీస్సులతో ప్రగతి భవన్‌లో చేరాడో, సదరు మంత్రిని కూడా వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఆ 'మంత్రి'కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్‌కు, ఎంపీ సంతోష్‌కు చేరవేసేవాడని మరొక ప్రచారం ఉన్నది. ఇదిలావుండగా అక్రమార్జనతో కోట్లు వెనుకేసుకున్న వారిపై ACB చర్యలకు ప్రభుత్వం ఆదేశిస్తుందా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాగే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తుల జప్తునకు ప్రభుత్వం పూనుకుంటుందా! అన్నది చూడాలి.