తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజును గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆయన జన్మదినం బుధవారం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బర్త్‌డే సందడి కొన్ని రోజుల ముందే మొదలైంది.
పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో క్రికెట్‌సహా వివిధ క్రీడా పోటీలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాలీబాల్ టోర్నీ నిర్వహించారు.
వివిధ సంస్థలు, సంఘాలు కూడా కేసీఆర్ బర్త్‌డే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రత్యేకించి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు బుధవారం పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదానం, ఆలయాల్లో పూజలు, కల్యాణాలు, యాగాలు, కేక్ కటింగ్, రోగులకు పండ్లు, పేదలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ వంటి కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ చాలెంజ్ కర్త జోగినిపల్లి సంతో్‌షకుమార్ కోటి వృక్షార్చన (గంటలో కోటి మొక్కలు నాటటం) కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో కోటి వృక్షార్చన నిర్వహణకు సర్వం సిద్ధంచేశారు. అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్‌సహా రాష్ట్ర మంత్రులు అందరూ తమ జిల్లాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.