తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ గత వారం రోజులుగా ఈ వైరస్ ఉధృతితీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా శుక్రవారం రికార్డు స్థాయిలో ఏకంగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాదీలు భయాందోళనకు గురవుతున్నారు.
లాక్డౌన్ కఠినంగా అమలులో ఉన్నా ఇలా కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఇందులో తెలంగాణకు చెందిన కేసులు 100 కాగా.. ఇతర రాష్ట్రాలు, సౌదీ నుంచి వచ్చిన వారిలో 69 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 973, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,381గా ఉంది. ఇవాళ నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,008కి చేరుకుంది.
ఇకపోతే, ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లాల వారీగా పరిశీలిస్తే, కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌కు చెందిన కేసులే 82 ఉండటం నగరవాసులను కలవరపాటుకు గురిచేసే విషయం. రంగారెడ్డి జిల్లా-14, మెదుక్-02, సంగారెడ్డి-02 కేసులు నమోదయ్యాయి. వలస కూలీల్లో 05 కరోనా సోకింది.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 64 మంది మొత్తం 69 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలో శుక్రవారం కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 71 మంది కరోనా పోరాడి చనిపోయారు. వరంగల్ రూరల్, యాదాద్రి, వణపర్తిలో మాత్రం కేసులేమీ నమోదు కాలేదు. మరోవైపు కొన్ని జిల్లాలో గత 14రోజులుగా కొత్తకేసులేమీ నమోదు కాలేదు.